ఏ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించని ప్రచార జోరు ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కనిపించింది. ప్రచార సమయం తక్కువే ఉన్నప్పటికీ ఆయా పార్టీల నుంచి ముఖ్యనేతలంతా రంగంలోకి దిగడంతో ఎన్నికల వేడి తీవ్రస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్ రెండోసారి గ్రేటర్ మేయర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, బీజేపీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని నగరంలో, తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండింటి పోరు మధ్య కాంగ్రెస్, టీడీపీ కూడా ప్రజల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి.
నాటి నుంచి నేటి వరకు..
జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 23 నుంచి 29 వరకు ప్రచార పర్వం కొనసాగింది. ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలను రప్పించి నగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. బీజేపీ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వినియాదవ్, బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేంద్రయాదవ్ నగరంలో రోడ్‌షోలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
టీఆర్ఎస్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ముఖ్యనాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్నికలను వేడెక్కించారు. ఆయా డివిజన్లలో అభ్యర్థులకు మద్దతుగా పర్యటించారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, అక్కడక్కడా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఉపాధ్యక్షురాలు సుహాసిని మాత్రమే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో అగ్రనేతల ప్రచారం ఎవరికి కలిసి వస్తుందో.. ఎవరు విజయం సాధిస్తారో.. వేచి చూడాలి.
చివరి రోజు.. ఫుల్ జోరు..
ఎన్నికల ప్రచారం చివరిరోజు ఆదివారం అన్ని పార్టీలూ హోరెత్తించాయి. అభ్యర్థులందరూ బల ప్రదర్శనకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీకి తోడు, కాంగ్రెస్, టీడీపీలు కూడా ర్యాలీలతో హడావిడి చేశాయి. పాతబస్తీలో ఎంఐఎం ప్రచారం హోరెత్తించింది. నాయకులు, అభ్యర్థులు చేపట్టిన బైక్‌ర్యాలీలతో నగరంలోని పలు రహదారులు హారత్ మోతలతో దద్దరిల్లిపోయాయి. లంగర్‌హౌజ్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, మాదాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, వారాసిగూడ, బౌద్దననగర్తోపాటు మరికొన్ని పాంత్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టి ప్రజలను ఆకర్షించాయి.