గ్రేటర్ ఎన్నికల ప్రచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని తలపించింది. రిపబ్లికన్లు, డెమోక్రట్లు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ట్రంప్ టెంపరితనంతో నోటికొచ్చినట్లు మాట్లాడాడు. బైడెన్ కూడా అదే స్థాయిలో ట్రంప్ కు జవాబిచ్చాడు. ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు జరగొచ్చనే వదంతుల నడుమ ఒక దశలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రస్థుతం గ్రేటర్ ఎన్నికల ప్రచారం కూడా హైదరాబాద్ లో అలాంటి వాతావరణాన్నే సృష్టించింది. మాటల యుద్ధం ప్రజల్లో ఒకింత అభద్రతా భావానికి కారణమైంది. దానికి తోడు హింసను రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని పోలీసు యంత్రాంగం సైతం ప్రకటించడం మరింత ఆందోళనకలిగిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, గ్రేటర్ ఎన్నికలకు నేతల దుందుడుకు స్వభావంలోనే కాదు చాలా అంశాల్లో సారూప్యత కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అవకాశం దొరికినప్పుడల్లా పక్కదేశాలపై కూడా విరుచుకుపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ అదే సరళి కనిపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా వైఫల్యాలను టీఆర్ఎస్ ప్రచారంలో పెట్టింది. బీజేపీ కూల్చివేతల, సర్జికల్ స్ట్రైక్ ల భాషనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వినియోగించాడు. తాను లేకపోతే అమెరికా భవిష్యత్తు లేదన్నట్లు ప్రచారం చేశాడు. గ్రేటర్ ప్రచారంలోనూ బీజేపీ నేతలు తమతోనే తెలంగాణ భవిష్యత్తని ప్రకటించుకున్నారు.
గ్రేటర్, అమెరికా ఎన్నికల్లో మరో పోలిక కనిపించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమొక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. పెన్సిల్వేనియా, ఫిలిడెల్ఫియాల్లో ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్న ఒబామా రిపబ్లికన్ల పాలనా వైఫల్యాలను తప్పుబట్టారు. పోలింగ్ కు ముందు రోజు నేరుగా ఓటర్లతో ఫోన్ లో సంభాషించిన ఒబామా ఓటు హక్కును వినియోగించుకోవాలని, బైడెన్ ని గెలిపించాలని కోరారు. సరిగ్గా అదే స్టైల్ ని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనుసరించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించిన కేటీఆర్, ప్రచార గడువు ముగిశాక నగర ఓటర్లతో నేరుగా ఫోన్లో మాట్లాడారు. వేరు వేరు డివిజన్లకు చెందిన ఓటర్లకు స్వయంగా మంత్రి ఫోన్ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
నా పేరు కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అంటూ ఓటర్లను పలకరిస్తున్నారు. మీ మద్దతు కోరుతున్నామంటూ మతం పేరుతో జరుగుతున్న రాజకీయల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్వేగాలకు లోనవ్వకుండా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచిస్తున్నారు. స్వయంగా మంత్రి నుంచే ఫోన్ రావడంతో ఓటర్లు ఆశ్చర్యానికి గురవడంతో పాటు, తమ ప్రాంతంలోని సమస్యలనూ మంత్రికి విన్నవించుకున్నారు. కేటీఆర్ వాయిస్ కాల్స్ ప్రయోగం అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఒబామా పోషించిన పాత్రను గుర్తుకు చేస్తోంది. అమెరికా ఎన్నికల్లో ఓటర్లు డెమోక్రట్ల వైపు మొగ్గుచూపినట్లు, గ్రేటర్ లోనూ టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతారో లేదో చూడాలి.