బల్దియా ఎన్నికలు కీకల దశకు చేరుకున్నాయి. ఎత్తులు పైఎత్తులతో సాగిన ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. పెద్ద పెద్ద నేతలంతా ప్రచారాన్ని రక్తికట్టించారు. ఓటర్ల మదిదోచుకునేందుకు పోటాపోటీగా హామీలు కురిపించారు. ఇక ఓటర్ల నిర్ణయమే పార్టీల భవిష్యత్తును తేల్చనుంది. కాగా… ఆఖరిరోజు ప్రచారం మాత్రం ఆసక్తికరంగా సాగింది. బీజేపీ తరుపున ప్రచారం నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ కి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచీ అభివృద్ధి నినాదాన్ని వల్లెవేస్తున్న అధికార పార్టీ ఆశలకు గండికొట్టే ప్రయత్నం చేశారు.
ఆరేళ్లలో హైదరాబాద్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, అమెజాన్ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని టీఆర్ఎస్ మొదటి నుంచీ ప్రచారం చేస్తోంది. ఐటీ హబ్ నిర్మాణంతో యువతకు ఉపాధి కల్పించామని, హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చుతామని మంత్రి కేటీఆర్ పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని అమిత్ షా ప్రస్తావించడం గమనార్హం. నవాబుల నగరాన్ని ఆధునిక నగరంగా మార్చుతామన్న అమిత్ షా హైదరాబాద్ ని ఐటీ పరంగా మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇది హైదరాబాద్ ఐటీ అభివృద్ధి క్రెడిట్ ను టీఆర్ఎస్ ఖాతాలోంచి కెట్టేసే ప్రయత్నంగానే కనిపిస్తోంది.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా అమిత్ షా మరో కీలకమైన ప్రకటన చేశారు. నగరంలో అక్రమ కట్టడాలను కూల్చేస్తామంటున్న టీఆర్ఎస్ మాటనే అమిత్ షా కూడా వల్లెవేశాడు. నగరంలో తాజా వరదల సందర్భంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసిండవచ్చు. కానీ ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా మొదటి నుంచీ కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామనే చెబుతోంది. అదే నినాదాన్ని ఇప్పుడు బీజేపీ భుజాలకెత్తుకోవడం గమనార్హం.
అక్రమ కట్టడాలను కూల్చివేయడం పట్ల ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి అక్రమ కట్టడాలు మతానికి సంబంధించినవైతే ముందు అభ్యంతరం చెప్పేది బీజేపీయే. హైదరాబాద్ కు ప్రతీకగా భావించే, నగర పర్యటనలో భాగంగా ముందుగా దర్శించుకున్న భాగ్యలక్ష్మి ఆలయం కూడా అక్రమ కట్టడాల జాబితాలో ఉందనే విషయాన్ని అమిత్ షా విస్మరించడం గమనార్హం. మెజార్టీ మతస్థుల మనసు దోచుకునేందుకు నిరంతరం ప్రయత్నించే బీజేపీ తాజా వ్యాఖ్యలో సెల్ఫ్ గోల్ చేసుకుంది.
చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం అక్రమ కట్టడమని స్వయంగా కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. 1951 నుంచి చార్మినార్ పరిరక్షణ బాధ్యతలు చూస్తున్న ఏఎస్ఐ సమాచార హక్కు చట్టం కింద ఈ విషయాన్ని వెల్లడించింది. 60వ దశకంలో అక్కడ ఒక చిన్న రాయికి పూజలు ప్రారంభమయ్యాయని చరిత్రకారుల అభిప్రాయం. క్రమంగా దాన్ని ఆలయం మార్చారని చెబుతుంటారు. 1960ల నుంచీ ఆ ఆలయాన్ని తొలగించాలని అధికారులకు సూచిస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గతంలో పేర్కొంది. ఈ లెక్కన భాగ్యలక్ష్మి ఆలయం అక్రమ కట్టడం అని స్పష్టమవుతోంది. మరి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునే ఆరాటంలో అమిత్ షా చేసిన అక్రమ కట్టడాల కూల్చివేత ప్రకటన ఈ ఆలయానికి కూడా వర్తిస్తుందా? పలువురు ప్రశ్నిస్తున్నారు.