స్టార్ హీరోల సినిమాలు కొన్ని కమర్షియల్ సూత్రాలకు కట్టుబడి ఉంటాయన్న మాట వాస్తవం. దర్శకులు రచయితలు వాటిని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తారు. వీటికి అతీతంగా వెళ్లాలని ప్రయత్నించిన దర్శకులకు ఆశించిన ప్రోత్సాహం వెంటనే దొరక్కపోవచ్చు. అలాంటి ఉదాహరణే గజిని. 2005 సంవత్సరం. దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తన రెండో సినిమాగా విజయ్ కాంత్ తో తీసిన రమణ(తెలుగు ఠాగూర్)బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఆయన పేరుని మారుమ్రోగించేసింది. రొటీన్ కి భిన్నంగా తన చిత్రాలు ఉండాలని తపించే దాస్ దగ్గర ఏ హీరోకైనా రిస్క్ అనిపించే కథ ఒకటుంది. దాన్ని తీయడానికి ఇదే సరైన సమయమని భావించాడు.
ముందు గజినీ కథ అజిత్ దగ్గరకు వెళ్ళింది. ఏవో కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇద్దరూ కలిసి అప్పటికే దీనా చేశారు. ఇది దాస్ డెబ్యూ మూవీ. తర్వాత మాధవన్ ని అడిగాడు. అక్కడా నో అనే సమాధానం వచ్చింది. అలా మొత్తం 12 హీరోలను కలిశాడు మురుగదాస్. గజినీ పాత్ర గుండు కొట్టించుకోవాల్సి రావడం, సగం సినిమా అదే గెటప్ లో ఉంటుందనే పాయింట్ వాళ్ళను భయపెట్టింది. 13వ ఆప్షన్ గా కలిసిన సూర్య రిస్క్ కు సై అన్నాడు. షూటింగ్ కు ముందే అన్నంత పని చేసి జుత్తు మొత్తం తీసేసి ఫోటో షూట్ లోనే వాహ్ అనిపించాడు. క్యాస్టింగ్ లో ప్రకాష్ రాజ్ స్థానంలో ప్రదీప్ రావత్, శ్రేయ ప్లేస్ లో నయనతార వచ్చి చేరారు
ఆసిన్ మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మెమెంటో అనే అమెరికన్ మూవీ ఆధారంగా ఇక్కడి ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు బాక్సాఫీస్ సూత్రాలను జోడించిన దాస్ గజినితో అద్భుతం చేశాడు. ఓ ధనవంతుడైన యువకుడు విలన్ల వల్ల ప్రియురాలిని కోల్పోయి తీవ్రమైన మతిమరుపు వ్యాధి తెచ్చుకుని శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే పాయింట్ ని దాస్ డీల్ చేసిన ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. తెలుగు వెర్షన్ 2005 నవంబర్ 4న రిలీజయింది. దీని దెబ్బకు ఒకరోజు ముందు వచ్చిన విక్రమ్ మజా, అదే రోజు విడుదలైన జగపతిబాబు పాండు రెండూ డిజాస్టర్ అయ్యాయి. హరీష్ జై రాజ్ పాటలు మారుమ్రోగిపోయాయి. గజినీ వల్లే సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ మొదలయ్యింది.