పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఒక హీరోని లాంచ్ చేస్తున్నప్పుడు మొదటి సినిమాకు సంబంధించిన కథ, దర్శకుడి ఎంపిక చాలా కీలకం. ఇవి సరిగ్గా కుదిరితే డెబ్యూతోనే మంచి విజయం సొంతం చేసుకుని ప్రేక్షకుల దృష్టిలో పడొచ్చు. 2003 సంవత్సరం. అల్లు ఫ్యామిలీ నుంచి అర్జున్ ని తెరకు పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు అల్లు అరవింద్. ఆయనకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కన్నా మంచి ఆప్షన్ కనిపించలేదు. రాజకుమారుడుతో మహేష్ బాబుని పరిచయం చేసిన తీరు, దానికి వచ్చిన స్పందన బాగా గుర్తుంది. అందుకే ఆ చిత్రం నిర్మాత అశ్వినిదత్ తో చేతులు కలిపి ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అదే గంగోత్రి.
అప్పటికే నరసింహ, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్స్ తో స్టార్ రైటర్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్న చిన్నికృష్ణ దీనికి కథను సమకూర్చారు. స్టోరీలో పెద్ద విశేషం ఉండదు. ఎక్కడో చిన్న ఊరిలో ధనవంతుడైన విలన్ కూతురికి, పేదవాడైన హీరోకు మధ్య జరిగే ప్రేమకథను చిన్నికృష్ణ చాలా తెలివిగా గంగోత్రి నదితో ముడిపెట్టి సెంటిమెంట్, ఎమోషన్స్ కు లోటు లేకుండా ఆల్ ఇన్ ప్యాకేజి లాగా ఇచ్చారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించగా అప్పుడే రచయితగా ఎదుగుతున్న విశ్వనాధ్ మాటలు సమకూర్చారు. కీరవాణి సంగీత దర్శకుడిగా, ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.
నిజానికి ఆ టైంలో రాఘవేంద్రరావు పెద్ద ఫామ్ లో లేరు. అన్నమయ్య తర్వాత ఆయన కొట్టిన హిట్టు రాజకుమారుడు ఒక్కటే. శ్రీమతి వెళ్ళొస్తా, లవ్ స్టోరీ 99, పరదేశి, ఇద్దరు మిత్రులు, పెళ్లి సంబంధం, మూడు ముక్కలాట, శ్రీ మంజునాథలతో పాటు మరో రెండు హిందీ సినిమాలు భారీ ఫ్లాపులయ్యాయి. అయినా కూడా నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుని కీరవాణి సహాయంతో హాయిగా చూసే ఒక చక్కని ప్రేమకావ్యాన్ని తెరమీద ఆవిష్కరించారు. ఫలితంగా గంగోత్రి ఊహించిన దానికన్నా గొప్ప విజయం అందుకుంది. అల్లు అర్జున్ లుక్, నటన మీద కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ మేజిక్ లో అవి కొట్టుకుపోయాయి. రెండో సినిమా ఆర్యతో బన్నీ వాటిని అరచేత్తో బద్దలు కొట్టేయడం అదో చరిత్ర.