దేశానికే కాదు.. ప్రపంచానికే సత్యం, అహింస గురించి బోధించిన మహానుభావుడు గాంధీ మహాత్ముడు. బారిస్టరుగా దక్షిణాఫ్రికాలోని దర్బన్ నగరానికి వెళ్లి.. అటార్నీగా పనిచేస్తూనే అక్కడి జాతి వివక్ష, అన్యాయాలపై అహింసా యుద్ధం చేశారు. అక్కడే సత్యాగ్రహమనే తిరుగులేని ఆయుధాన్ని మొదట ప్రయోగించారు. రెండు దశాబ్దాలపాటు గాంధీతత్వంతో డర్బన్ ను పునీతం చేశారు. ఇప్పుడు అదే డర్బన్ నగరంలో ఆయన రక్త సంబంధీకురాలు, ముని మనవరాలు గాంధీ సిద్ధాంతానికి విరుద్ధమైన మోసం కేసులో శిక్షకు గురికావడం ఆవేదన కలిగిస్తోంది.
ఎవరీ లతా రాంగోబిన్
మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ. తొలినాళ్లలో తన తాత గాంధీజీ నడయాడిన డర్బన్ నగరంలోనే స్థిరపడ్డారు. అక్కడ ఆమె మానవ హక్కుల కార్యకర్తగా వ్యవహరిస్తూ.. గాంధీ సిద్ధాంతాలకే కట్టుబడి జీవించారు. ఆమె కూతురే ఆశిష్ లతా రాంగోబిన్. తల్లిలాగే ఈమె కూడా మానవ హక్కుల కార్యకర్తే. పార్టీసిపేటివ్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ అనే అంతర్జాతీయ అహింసా సంస్థ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానూ వ్యవహరిస్తున్నారు. అంత పేరున్న ఆమెను మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా డర్బన్ న్యాయస్థానం తేల్చి, శిక్ష విధించింది. 2015 నుంచి జరుగుతున్న ఈ కేసులో తుది తీర్పును కోర్టు ప్రకటించడంతో భారతీయ సమాజం నివ్వెరపోయింది.
ఏమిటీ కేసు
డర్బన్ లోనే స్థిరపడిన భారతీయ వ్యాపారి ఎస్.ఆర్.మహరాజ్ న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో వస్త్రాలు, చెప్పుల వ్యాపారం చేస్తున్నారు. 2015లో ఆయన్ను కలిసిన లతా రాంగోబిన్ హాస్పిటల్ గ్రూప్ నెట్కేర్ కోసం భారత్ నుంచి మూడు కంటైనర్ల లెనిన్ వస్త్రాలు తెప్పించామని.. అయితే కస్టమ్స్ డ్యూటీ ఇతర చార్జీలు చెల్లించేందుకు డబ్బు సాయం చేయాలని కోరుతూ కంటైనర్ల షిప్మెంట్ పత్రాలు అతనికి ఇచ్చారు. ఆమెకు ఉన్న విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకొని మహరాజ్ 6.2 మిలియన్ల ర్యాండ్లు (రూ.3.3 కోట్లు) అప్పుగా ఇచ్చారు.
అయితే తర్వాత తీరిగ్గా లతా రాంగోబిన్ ఇచ్చిన పత్రాలు పరిశీలించిన మహరాజ్ అవి తప్పుడు పత్రాలని, ఆమె చెప్పినట్లు కంటైనర్లు రాలేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు డర్బన్ కోర్టులో విచారణలో ఉంది. లతా రాంగోబిన్ బెయిల్ పై ఉన్నారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు లతా రాంగోబిన్ ను దోషిగా తేల్చింది. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీలుకు కూడా అవకాశం ఇవ్వలేదు. మహాత్ముడి ముని మనవరాలు ఇలా జైలు శిక్షకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా భారతీయులను క్షోభకు గురి చేస్తోంది.