ఒకప్పుడు కృష్ణా జిల్లాలో తెలుగుదేశానికి తిరుగుండేది కాదు. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఒకటి రెండు ఎన్నికల్లో తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునేది. కానీ 2019 ఎన్నికల్లో వీచిన జగన్ గాలిలో మొదటిసారి కోలుకోలేని విధంగా దెబ్బతింది. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోనే గెలవగలిగింది. వాటిలో ఒకటి గన్నవరం. అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ ఆ తర్వాత పరిణామాల్లో అధికార వైఎస్సార్సీపీకి జై కొట్టారు. దాంతో టీడీపీ కొత్త ఇంఛార్జిని వెతుక్కోవాల్సి వచ్చింది. తీవ్ర అన్వేషణ తర్వాత నియమించిన ఆ ఇంఛార్జి నియోజకవర్గానికి సరిపోరని.. ఆయన్ను మార్చి మరో బలమైన నేతను నియమించాలని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు మొత్తుకుంటున్నా అధిష్టానం పెడచెవిన పెడుతోంది.
ఇంచార్జిగా స్థానికేతరుడు
గన్నవరంలో మంచి పట్టున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎన్నికల తర్వాత కొన్ని నెలల్లోనే పార్టీ నాయకత్వంతో విభేదించి వైఎస్సార్సీపీకి చేరువయ్యారు. ఆయనతోపాటే టీడీపీ క్యాడర్ చాలావరకు షిఫ్ట్ అయ్యింది. దాంతో నియోజకవర్గంలో ఆ పార్టీ డీలా పడటంతోపాటు నాయకత్వ లోపం ఏర్పడింది. కొత్త ఇంఛార్జి నియామకానికి అధిష్టానం ప్రయత్నించినా సరైన నేత కనిపించలేదు. చివరికి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తెచ్చి ఇంఛార్జిగా నియమించింది. ఆయన బీసీ కావడంతో ఆ వర్గాల మద్దతు లభిస్తుందని ఆశించింది. అది నెరవేరకపోగా మచిలిపట్నానికి చెందిన ఆయన్ను టీడీపీ వర్గీయులే స్థానికేతరుడిగా పరిగణిస్తున్నారు. ఫలితంగా నాయకుడికి, శ్రేణులకు మధ్య సమన్వయం కుదరడంలేదు. పైగా పార్టీ తరఫున బచ్చుల బలమైన వాయిస్ వినిపించలేకపోతున్నారు. అతిధిలా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి పరామర్శలు, శుభాకాంక్షలు వంటి కార్యక్రమాలతో సరిపెడుతున్నారు తప్ప క్యాడర్ ను కలుపుకొని పార్టీని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించడంలేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఆయన సరితూగరు..
ఏ రకంగా చూసినా గన్నవరానికి బచ్చుల అర్జునుడు సరిపోరని కార్యకర్తలు అంటున్నారు. గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన దాసరి బలవర్ధనరావుతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యే వంశీ ఆర్థికంగా బలవంతులు. ఎమ్మెల్యేలుగా అభివృద్ధి పనులతోపాటు సొంతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గట్టి పట్టు సాధించారు. అటువంటి వంశీని ఎదుర్కోవాలంటే అంత బలమైన నేత అవసరమని అంటున్నారు. కానీ ప్రస్తుత ఇంఛార్జి బచ్చుల అర్జునుడు ఆర్థికంగా అంత బలవంతుడు కాదు.. స్థానికేతరుడు కావడం వల్ల ప్రజల్లో అంత బలమూ లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అర్జునుడి స్థానంలో మరో బలమైన నేతను ఇంఛార్జిగా నియమించాలని టీడీపీ కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు కొన్నాళ్లుగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు