మాములుగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో ఇవి మరీ తగ్గిపోయాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా ఈ నేపథ్యంలోనే ‘అడవిరాముడు’లాంటి ఇండస్ట్రీ సాధించారు. మెగాస్టార్ చిరంజీవికి ‘అడవిదొంగ’ రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది. వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున ‘అరణ్యకాండ’, బాలకృష్ణ ‘భలేవాడివి బాసూ’ డిజాస్టర్లు అయినప్పటికీ వాటి కథాంశం అడవుల్లోనే ఉంటుంది. ఇలా ఎందరో హీరోలు ఈ థీమ్ తో సినిమాలు చేసినవాళ్ళే. ప్రభాస్ కు సైతం ‘అడవిరాముడు’ రూపంలో ఓ సినిమా ఉంది.
అయితే గత కొంత కాలంగా వీటి తాకిడి తగ్గింది. షూట్ చేయడంలో ఉన్న రిస్క్ తో పాటు జంతువులను వాడుకోవడంలో ఉన్న ఆంక్షల కారణంగా వీటి మీద ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అడపాదడపా హాలీవుడ్ నుంచి టార్జాన్, మోగ్లీ లాంటి మూవీ వచ్చినప్పుడు తెరమీద దట్టమైన అడవులను చూసి చాలా రోజులయ్యింది. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ చూస్తుంటే మళ్ళీ అటు వైపు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రానా నటించిన ‘అరణ్య’ కంప్లీట్ గా ఇదే కాన్సెప్ట్ తో రూపొందింది. గ్రాఫిక్స్ వాడినప్పటికీ సహజమైన అటవీ నేపథ్యంలో షూటింగ్ చేశారు. విడుదలకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ సబ్జెక్టుగా తీసుకుని మొత్తం అడవుల్లోనే సాగుతుంది.
వేణు ఊడుగుల డైరెక్షన్లో సురేష్ సంస్థ తీస్తున్న ‘విరాట పర్వం’ చెట్టు పుట్టా వెంట తిరిగే నక్సలైట్ కాన్సెప్ట్. తాజాగా మూడు రోజుల క్రితం క్రిష్ దర్శకత్వంలో మొదలైన వైష్ణవ తేజ్ రెండో సినిమా కూడా మొదటి నుంచి చివరిదాకా ఫారెస్ట్ లోనే సాగుతుందట. ఏకబికిన 40 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో 30 రోజులు వికారాబాద్, 10 రోజులు నల్లమల ప్లాన్ చేశారట. చాలా త్వరగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరిగిందని సమాచారం. అంటే నవంబర్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ తెలుగు సినిమా అడవులకు బూమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. రిస్క్ ఉన్నప్పటికీ ఒకే లొకేషన్ లో ప్రశాంతంగా షూటింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో ఇప్పుడు కొందరు దర్శక రచయితలు ప్రత్యేకంగా అడవి కోణంలో కథలు అల్లుతున్నారు. ఆర్ఆర్ఆర్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ట్రాక్ ఎక్కువ సేపు అడవిలోనే ఉంటుందట. చూస్తుంటే అడవి టాలీవుడ్ కు ఓ నయా ఫార్ములాగా మారడం ఖాయం.