హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పై ప్రయాణాలు ప్రారంభించి 20 రోజులు కూడా గడవక ముందే ప్రజలకు వణుకు పుట్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద కారు ఫ్లై ఓవర్ నుండి కింద రోడ్ పై పడటంతో మణికొండకు చెందిన సత్తెమ్మ అనే మహిళ మృత్యువాత పడగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. వేగంగా వెళ్తున్న కారు ఫ్లై ఓవర్ నుండి కింద పడటంతో ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం ఎదురుచూస్తున్న సత్యవేణి దుర్మరణం చెందింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ తో పాటు మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఫ్లై ఓవర్ పై 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళాలి కానీ ప్రమాదానికి గురైన కారు ప్రమాదం జరిగే సమయానికి 100 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో వెళ్తున్నట్లు తెలుస్తుంది.
గతంలో ఈనెల 10 న ఇదే ఫ్లై ఓవర్ వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఫ్లై ఓవర్ పైన ఇద్దరు యువకులు సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో హైటెక్స్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో ఫ్లై ఓవర్ నుండి కిందపడి వారివురు చనిపోయారు. ఆ సంఘటన మరవకముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.గతంలో అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులు మీద పడి ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఫ్లై ఓవర్ లో అనేక మలుపులు ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు. ఫ్లై ఓవర్ పై జరిగే ప్రమాదాలకు కారణాలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిష్కరించాలని, అప్పటివరకు ఫ్లై ఓవర్ ని మూసివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.