జీహెచ్ఎంసి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా పరిశ్రమకు వరాలు వెసులుబాట్లకు హామీలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 10 కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలకు జిఎస్టి రీఇంబర్స్ మెంట్, 40 వేల సినీ కార్మికులకు రేషన్ కార్డులు, లాక్ డౌన్ సమాయానికి కనీస విద్యుత్ చార్జీ మినహాయింపు లాంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ ఓకే కానీ ఫ్లెక్సిబుల్ టికెట్ ప్రైజింగ్ కు సానుకూలంగా సంపాదించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇప్పటిదాకా నార్త్ లోని కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ విధానం వస్తే ఎగ్జిబిటర్లుకు మంచిదే కానీ అసలు పోషకులైన ప్రేక్షకులకు మాత్రం చిక్కులు తెచ్చి పెట్టేది.
ఈ పద్ధతి దేని గురించి అంటారా. మాములుగా రోజు ఎన్ని షోలు పడాలి, తరగతులకు తగట్టు టికెట్ ధరలు ఎంత ఉండాలనేది పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. పైన చెప్పిన సిస్టమ్ వస్తే ఇకపై థియేటర్ యజమానులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సినన్ని షోలు వేసుకోవడంతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు. ఉదాహరణకు మహేష్ బాబు సినిమా మాములుగా అయితే ప్రస్తుతం ఏ రోజైనా 150 రూపాయలు టికెట్ అనుకుందాం. ఇప్పుడు అలా కాకుండా సోమవారం నుంచి గురువారం దాక 100 నుంచి 150 రూపాయలు, వీకెండ్ చివరి మూడు రోజులు శుక్రవారం నుంచి ఆదివారం దాకా 200 నుంచి 500 మధ్యలో ఉండొచ్చన్న మాట.
ఇదే కనక జరిగితే సగటు మధ్యతరగతి జీవికి హైదరాబాద్ లాంటి నగరాల్లో వీకెండ్ సినిమా చూడటం కష్టమైపోతుంది. ఢిల్లీ, కోల్కతా, ముంబైలో ఇది ఎప్పటి నుంచో అమలులలో ఉంది. కానీ విపరీతంగా సినిమాలు చూసే తెలుగు ఆడియన్స్ కు ఇది సింక్ అవ్వదు. ఇప్పటికే విపరీత నష్టాల్లో ఉన్న థియేటర్ వ్యవస్థకు ఇలాంటివి మంచి చేస్తాయి కానీ చూసేవాళ్ల కోణంలో కూడా ఆలోచించాలని మూవీ లవర్స్ కోరుతున్నాయి. అధికారిక ప్రకటన, జీవో వచ్చే దాకా దీని మీద కంప్లీట్ కంక్లూజన్ కు రాలేం కానీ డిసెంబర్ లో హాళ్లు తెరిచాక ప్రభుత్వం చెప్పినవి అమలు అయ్యాక ఓ క్లారిటీ వస్తుంది