గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కెమికల్ గొడౌన్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గొడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పేలుళ్లు కూడా సంభవించాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే అహ్మదాబాద్ నగర శివారులో ఉన్న పారిశ్రామికవాడ పిరానా-పిప్లాజ్ రోడ్డులోని గోదాములో రసాయన పదార్థాలు నిల్వ ఉన్న పోర్షన్లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం గోడలకు పెద్ద రంధ్రం పడి, భవనం కుప్పకూలడంతో పాటుగా భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భవన శిథిలాల కింద మరియు మంటల్లో చిక్కుకుని 12 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక యంత్రాలతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని పదిగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.