నెపోలియన్ బానిస సంకెళ్లు తెంచుకొని తొట్టతొలుత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న నల్లజాతి దేశంగా చరిత్ర సృష్టించిన హైతీ తీవ్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాల్లో కూరుకుపోయింది. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, ప్రతిపక్షాల ఆందోళనలతో ఈ చిన్న లాటిన్ అమెరికా దేశం అట్టుడుకుతోంది. ఇదే అదనుగా సాయుధ ముఠాల హింస, విధ్వంసాలు పెచ్చరిల్లాయి. ఇవి చివరికి దేశ అధ్యక్షుడి హత్యకు దారితీశాయి. వీటికి తోడు భూకంపాలు, తుఫాన్లు, కరోనా వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశ ఆర్థిక, సామాజిక రంగాలను చిదిమేశాయి. ఈ పరిణామాల మధ్య ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న హైతీ పాలించే ప్రభుత్వమే లేకుండా.. ఎమర్జెన్సీ పిడికిలిలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.
అమెరికాపైనే ఆధారం
ఉత్తర అమెరికాలోని కరీబియన్ దేశాల్లో హైతీ ఒకటి. వ్యవసాయ ప్రధానమైన ఈ దేశ జనాభా 11 మిలియన్లకు మించదు. అరటి తోటలకు బాగా ప్రసిద్ధి. దాంతోపాటు కోకో, మామిడి వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. చక్కెర శుద్ధి, వస్త్రాలు, సిమెంట్, పిండి మిల్లుల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. వాణిజ్యపరంగా, ఆర్థికంగా హైతీ అమెరికాపైనే ఆధారపడుతుంటుంది. ఈ దేశ ఎగుమతుల్లో 80 శాతం వాటా అమెరికాదే. ఇక్కడ కూలిరేట్లు చాలా తక్కువ. దాంతో ప్రజల సగటు వినియోగ శక్తి రోజుకు రెండు అమెరికన్ డాలర్లకు దిగువనే ఉంది.
ప్రకృతి వైపరీత్యాలు
ఈ చిన్ని పేద దేశాన్ని ప్రకృతి వైపరీత్యాలు మరింత చితికిపోయేలా చేస్తున్నాయి. భౌగోళికంగా ఈ ప్రాంతాల్లో భూకంపాలు, అతి తీవ్ర తుఫాన్లు తరచూ సంభవిస్తుంటాయి. 2010లో సంభవించిన పెను భూకంపం హైతీని కుదిపేసింది. ఆర్థిక రంగాన్ని తలకిందులు చేసింది. ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆనాటి పెను విలయం ధాటికి 2.50 లక్షల నివాస గృహాలు, 30 వేల వాణిజ్య భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సుమారు మూడు లక్షల మంది చనిపోవడమో, నిరాశ్రయులు కావడమో జరిగింది. ఆ విపత్తు గాయాల నుంచి తేరుకోకముందే 2016 ఆక్టోబరులో అతి తీవ్రమైన హరికేన్ తుఫాను విరుచుకుపడింది. పెను విధ్వంసం సృష్టించింది. సుమారు రెండు లక్షల ఇళ్లను ధ్వంసం చేసి.. 1.4 మిలియన్ల ప్రజలను నిరాశ్రయులను చేసింది. సుమారు 2.8 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టం మిగిల్చి కోలుకోలేని దెబ్బ తీసింది. వీటికి తోడు గత ఏడాది మార్చి నుంచి కరోనా భూతం దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటికీ దేశంలో పదివేలకుపైగానే యక్టీవ్ కేసులు ఉన్నాయి. వీటన్నింటి వల్ల దేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది.
Also Read : లాక్ తెరవగానే ఎంటర్ అవుతా! కలకలం సృష్టిస్తున్న శశికళ ఆడియో
రాజకీయ అస్థిరత
పేదరికంతో అల్లాడుతున్న హైతీని ఐదేళ్లుగా నెలకొన్న రాజకీయ అస్థిరత మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. 2016 అధ్యక్ష ఎన్నికలతో ఇది మొదలైంది. ఆ ఎన్నికల్లో దేశ ఉత్తర ప్రాంతానికి చెందిన వాణిజ్య ప్రముఖుడు, బనానా మాన్ గా ప్రసిద్ధుడైన జోవెనెల్ మొయిస్ తొలిసారి అధ్యక్ష పదవికి పోటీ పడి గెలిచారు. ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించడంతో వివాదం మొదలైంది. అయితే కోర్ట్ డిక్రీతో జోవెనెల్ మొయిస్ ఏడాది తర్వాత 2017 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునేలా చట్టాలను మార్చడం ప్రారంభించారు. 2019లో జరగాల్సిన జాతీయ అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేశారు. ఆయన చర్యలతో దేశంలో అశాంతి పెరిగింది. ప్రతిపక్షాలు దేశవ్యాప్త ఆందోళనలు చేస్తూ.. ఏడాది కాలంగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వ వ్యతిరేక కుట్రగా ప్రకటించిన అధ్యక్షుడు మొయిస్ డజన్ల కొద్దీ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. మరోవైపు ఇప్పటికే ఆరుగురు ప్రధాన మంత్రులను మార్చిన అధ్యక్షుడు.. తన హత్యకు ఒక రోజు ముందు ఏడో ప్రధానిని నియమించారు.
దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టిన అధ్యక్షుడు
పేదరికాన్ని రూపుమాపుతానంటూ అధికారం చేపట్టిన మొయిస్.. దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టారు. రాజకీయ అస్థిరతను ఆసరా చేసుకుని సాయుధ ముఠాలు రెచ్చిపోయాయి. ఈ ముఠాల కిడ్నాపులు, హింస, విధ్వంసాలతో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. చివరికి అవే అధ్యక్షుడు జోవెనెల్ మొయిస్ ప్రాణాలను బలిగొన్నాయి. బుధవారం తెల్లవారుఝామున తన సొంత నివాసంలో ఉన్న మొయిస్ పై సాయుధ ముఠా దాడి చేసి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. అతని సతీమణి తీవ్రంగా గాయపడ్డారు. కొలంబియా మాజీ సైనికులు, హైతీ సంతతికి చెందిన 26 మంది సభ్యుల విదేశీ ముఠా ఈ దాడికి పాల్పడింది. అధ్యక్షుడు మొయిస్ హత్యతో దేశంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వం లేకుండా పోయింది. దేశాధ్యక్షుడు లేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టాలని హైతీ రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోవిడ్ తో కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఈ ఇద్దరు లేనప్పుడు ప్రధానమంత్రి తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే అధ్యక్షుడు మొయిస్ హత్యకు గురికావడానికి ముందు రోజే ఏరియల్ హెన్రీని ప్రధానిగా నియమించారు. కానీ ఆయన ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టకపోవడంతో తాత్కాలిక ప్రధాని జోసెఫ్ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
Also Read : నారాయణకు ఇప్పుడైనా అర్థమై ఉంటుందా?