మాజీ సీఎం చంద్రబాబు తన స్వలాభం కోసం రాజధాని అమరావతిపై అందమైన కధలు చెప్పి అక్రమాలు చేశారని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ మరో సారి మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని బుగ్గన ఆరోపించారు. బినామీ పేర్లతో టీడీపీ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పంట భూములను నాశనం చేసి ప్లాట్లు వేయడానికి సింగపూర్ కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలి కావాల్సి రావడం బాధకరమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొన్నారని ధ్వజమెత్తారు.
అంతా ఓ మాయ..
రాజధాని పై చంద్రబాబు మాయ చేసి అందర్నీ మోసం చేశారని బుగ్గన మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ హైదరాబాద్‌లో ఉండిపోయిందని, రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడ్డ ప్రాంతమన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరుజిల్లా వరకు వ్యవసాయం ఎక్కువ మంది ఆధారపడ్డారు. గుంటూరు, నూజివీడు ప్రాంతంలో బాబు రాజధాని పేరుతో మాయ చేసి.. ఈ ప్రాంతంపై పక్క ప్లాన్ ప్రకారం దృష్టి పెట్టారన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా రాజధానిని నిర్మించాల్సి పోయి.. సింగపూర్ ప్రభుత్వాన్నీ భాగస్వామ్యం చేశామని చంద్రబాబు అందరిని నమ్మించారు. ఇన్సైడ్ ట్రేడింగ్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయి. అవి త్వరలోనే బయటకు వస్తాయని రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాగా, రాజధాని అమరావతి పై జగన్ సర్కార్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ అబ్దుల్ బషీర్, జలవనరుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎల్. నారాయణ రెడ్డి, జాతీయ స్ట్రక్చరల్ అసోసియేసిన్ మాజీ ఆద్యక్తుడు పి. సూర్యప్రకాష్, రోడ్లు భవనాల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు పి.సుబ్బరాయ శర్మ, ఎఫ్.సి.ఎస్. పీటర్, ఏపీ జెన్కో రిటైర్డ్ డైరెక్టర్ ఆదిశేషు, సెంట్రల్ డిసైన్ ఆర్గనైజెషన్ రిటైర్డ్ ఇంజనీర్ ఐఎస్ఎన్ రాజు ఈ కమిటీలో ఉన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాల పై ఓ నివేదికకు ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే.