రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ)గా తనను కావాలనే తొలగించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తుది అఫిడవిట్‌ను ఈరోజు హైకోర్టులో దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రాథమిక పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం ఈ రోజు పూర్తి వివరాలతో తుది అఫిడవిట్ ను కోర్టు ముందు ఉంచింది.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే కొత్త ఎస్ఈసీ ని నియమించమని ప్రభుత్వం పేర్కొంది. ఎస్ఈసీ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి ని నియమించామని తెలిపింది. ఇందుకోసం ఆర్డినెన్స్ ను తెచ్చామని అఫిడవిట్ లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లోని ఎస్ఈసీల కాలపరిమితిని తన అఫిడవిట్లో పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు చేశారని తెలిపింది. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంపై నిమ్మగడ్డ నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల అఫిడవిట్ లో వివరించింది.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల కొత్త ఎన్నికల కమిషనర్ గా చెన్నై హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజు నియమించిన విషయం తెలిసిందే. అంతకు ముందుగా ఎస్ఈసీ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడు ఏళ్లకు తగ్గిస్తూ, ఎస్ ఈ సి పదవి కి నూతన అర్హతలను పేర్కొంటూ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ప్రకారం చెన్నై హై కోర్టు మాజీ జడ్జి కనగరాజు ను ఎస్ఈసీగా నియమించింది తనను ఎస్ఈసీగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు మరికొంతమంది కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటిపై విచారణ చేసిన హైకోర్టు పూర్తి వివరాలతో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఈనెల 28వ తేదీన తుది విచారణ జరుగనుంది.