నారు వేయడం తప్ప పోరు తెలియని రైతు.. నేడు పోరు బాట పట్టాడు. వ్యవసాయమే లోకంగా పొలం వదిలి బయటకు రాని రైతు ఇప్పుడా వ్యవసాయం నిలుపుకోవడానికి రోడ్డెక్కాడు. ఓట్ల పోరులో ఎదురులేకుండా గెలుస్తున్నబీజేపీ పెద్దలకు రైతు పోరును గెలవడం తలకుమించిన భారంగా మారింది. తాము ఏ చట్టం చేసినా నడిచిపోతుందని భావించిన కేంద్రం ప్రభుత్వానికి వ్యవసాయ చట్టాలపై పెరుగుతున్న వ్యతిరేకతను చల్లార్చడం సాధ్యం కావడం లేదు. ఇప్పటికే 5 సార్లు రైతులతో చర్చలు జరిపినా సఫలం కాలేదు. భారత్ బంద్ తో రేపు మరోమారు భేటీ జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం జరుగుతున్న భారత్ బంద్ కు అనూహ్య మద్దతు లభిస్తోంది. పంజాబ్ మినహా ఎక్కడా రైతులు నిరసన తెలపడం లేదంటున్న కొందరు బీజేపీ పెద్దలకు కనువిప్పు కలిగేలా భారత్ బంద్ దేశంలో అత్యధిక రాష్ట్రాలలో కొనసాగుతోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు.
సాధారణంగా బలమైన ప్రతిపక్షమో, పార్టీయే ఇచ్చిన బంద్ లే విజయవంతమవుతాయి. కానీ భారత్ బంద్ కు తెలుగు రాష్ట్రాలలో కూడా అనూహ్య మద్దతు లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ మంత్రులైతే ఏకంగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణలో బస్సులు రోడ్డెక్కలేదు. టీఆర్ఎస్ మంత్రులు మొదలుకుని నేతలంతా ఎక్కడికక్కడ బంద్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా హర్తాల్ చేస్తున్నాయి. పలు చోట్ల నిరసనల్లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. నేరుగా మంత్రులే ఆందోళనలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు బంద్ విజయవంతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. పలు చోట్ల వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు ఏపీలో కూడా రైతు చట్టాలపై నిరసనలు కొనసాగుతున్నాయి.
నేను ఐటీ ఉద్యోగిని, కానీ రైతు బిడ్డను, డిసెంబర్ 8న రైతు బంద్ కు మద్దతు ఇస్తున్నాను! మరి.. మీరు..? అంటూ ఐటీ ఉద్యోగులు కూడా బంద్ లో పాల్గొనడం మరింత ప్రత్యేకత. ల్యాప్ టాప్, కీబోర్డు, మౌస్ తో కాలం గడుపుతూ.. ప్రాజెక్టులతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులు కూడా రైతులకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగించారు. అంతేకాదు.. రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇప్పుడు సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడినా మూలాలు వ్యవసాయ రంగమే అని చాటి చెబుతున్నారు. ఎప్పుడూ పొలం వదిలిరాని రైతు ప్రస్తుతం రోడ్డెక్కి రోజుల తరబడి ఆందోళన చేస్తున్నాడంటే.. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు, సవరణలు వ్యవసాయ రంగానికి చేటు తెస్తాయని ఎంతలా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చని ఫోరమ్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా నగరాలు ఇంత సుభిక్షంగా ఉన్నాయంటే అదంతా అన్నదాత కష్టఫలితమేనని, అందుకే రైతు పోరాటానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు, పలు ప్రజా, రైతు సంఘాలు మద్దతు ఇవ్వడమే కాదు.. ఐటీ రంగం సహా ఇతర రంగాలు కూడా రైతులకు మద్దతుగా ఈరోజు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. దీంతో ఈ భారత్ బంద్ చరిత్రలో నిలిచిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.