టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరుగా అంతకు మించి గొప్ప పంపిణిదారుడిగా పేరు పొందిన విఎంసి(విజయ మల్లీశ్వరి క్రియేషన్స్) బ్యానర్ అధినేత వి దొరస్వామిరాజు ఇవాళ కన్నుమూశారు. బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస తీసుకున్నారు. గుండెపోటుతో అక్కడికి వెళ్ళిన కొద్దిసమయంలో అనంతలోకాలకు వెళ్ళిపోయారు. సుమారు ఏడు వందలకు పైగా సినిమాలను ఎక్కువగా సీడెడ్ ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన రాజు గారు పేరుకు తగ్గట్టే వ్యాపార వ్యవహారాలు నడిపేవారు. ఏది పట్టుకున్నా బంగారం అన్న తరహాలో అటు పంపిణీదారుడిగా ఇటు నిర్మాతగా అధిక శాతం విజయాలే అందుకోవడం ఈయనకు ప్రత్యేకత సంతరించి పెట్టింది.1994లో నగరి ఎమెల్యేగానూ వ్యవహరించారు. టిటిడి బోర్డ్ మెంబర్ గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చాలా పదవులకు ఆయన వన్నె తెచ్చారు.
ఇతర సంస్థలతో పోలిస్తే తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చరిత్ర మర్చిపోలేని అద్భుతాలు ఇచ్చారు ఆయన. 1990లో ఏఎన్ఆర్ తో విగ్గులేకుండా ప్రధాన పాత్రలో సీతారామయ్య గారి మనవరాలు తీసినప్పుడు అందరూ ఆయన సాహసానికి షాక్ తిన్నారు. కమర్షియల్ సినిమా రాజ్యమేలుతున్న తరుణంలో ఫాం లో లేని క్రాంతి కుమార్ ని దర్శకుడిగా కుటుంబాలను కదిలించిన ఆణిముత్యాన్ని ఇచ్చారు. మీనా హీరొయిన్ గా పరిశ్రమకు తెలిసింది దీంతోనే.1997లో మాస్ హీరో నాగార్జునతో అన్నమయ్య తీసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్లే. కాని అది కొత్త తరంలో భక్తి చిత్రాలకు ఒక ఎన్సైక్లోపిడియాగా నిలిచిపోయింది. నాగ్ నటవిశ్వరూపం, కీరవాణి సంగీతం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయి దాన్ని తలదన్నే సినిమా మరొకరు తీయలేనంతగా మిగిలింది.
ఇవి కాకుండా విఎంసిలో మొదటి చిత్రం కిరాయిదాదా, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కూడా మంచి విజయాలు అందుకున్నాయి. 2003లో రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తీసిన సింహాద్రి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి తారక్ ని టాప్ లీగ్ లోకి తీసుకెళ్ళింది. అప్పట్లో దీని వసూళ్ళ సునామి చూసి అగ్ర హీరోలు సైతం షాక్ తిన్నారు. కాని ఆ తర్వాత కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, వెంగమాంబ, శ్రీ వాసవి వైభవం లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. ఆ తర్వాత ఆరోగ్య కారణాల వల్ల నిర్మాణానికి దూరమైన దొరస్వామిరాజు ఇవాళ ఇండస్ట్రీతో పాటు ఈ లోకం నుంచే సెలవు తీసుకుని విషాదాన్ని మిగిల్చారు.