అధికారం కోల్పోయే సరికి తెలుగుదేశం నాయకులు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. సహనం పాలు మరీ తక్కువై పోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాడిన భాషపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే.
తాజాగా రాజానగరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి అధారాలు చూపకుండా రాజానగరం నియోజకవర్గంలో ఆ కుటుంబ సభ్యులు రక రకాలుగా దోపిడీలు చేసి రూ. వందల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు.
బురద జల్లుడే..
వైఎస్సార్ సీపీ రెండున్నర ఏళ్ల పాలనలో భూకబ్జాలు, ఇసుక దోపీడీ, మట్టి అమ్మకాల ద్వారా రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు దోచుకున్నారని లెక్క కట్టేశారు. సీతానగరం – రాజమహేంద్రవరం రోడ్డు విస్తరణ పేరుతో మట్టిని అమ్ముకున్నారని నిర్థారించేశారు. దళితులపై దాడులకు రాజానగరం నియోజకవర్గం వేదికైందన్నారు. సీతానగరంలో గిరిజన లెక్చరర్‌పై దాడికి పాల్పడిన సంఘటనపై సీతానగరం ఎస్ఐ కాల్‌లిస్టు బయటపెట్టి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజానగరంలో జరిగే అవినీతిని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాడన్న అక్కసుతోనే లెక్చరర్‌పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని కనిపెట్టేశారు.
Also Read : భవిష్యత్తు లో ఎమ్మెల్యే సీట్ అని ఆశపడి ఉన్న మేయర్ సీట్ పొగొట్టుకున్న వైనం…
ఇది మరీ విడ్డూరం..
కరోనా సమయంలో రాజానగరం వైఎస్సార్ సీపీ నాయకులు ట్రస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.15 కోట్లు అక్రమ వసూళ్లు చేశారని ఆరోపించారు. రాజానగరం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ నేతల అక్రమ వసూళ్లపై సత్యప్రమాణం చేస్తారా అని సవాల్ కూడా విసిరారు. రాజానగరం పేరు చెప్పటానికి సిగ్గుపడే విధంగా వైఎస్సార్ సీపీ నేతలు పాలన సాగిస్తున్నారని వెంకటేష్ తెగ ఫీల్ అయిపోయారు.
ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ఆధారాలేవీ?
నియోజకవర్గం పేరు ప్రతిష్టలు పాడైపోతున్నాయని, వందల కోట్ల అవినీతి జరిగిందని ఆవేశ పడిన ఆయన అందుకు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదు. రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్లు దోపిడీ జరిగిందని ఏదో ఉజ్జాయింపుగా ఆరోపించేశారు. గతంలో నియోజకవర్గంలో జరిగిన దళిత యువకుడి శిరోముండనంపై గానీ, ఇటీవల గిరిజన లెక్చరర్ పై దాడి విషయంలో గానీ కేసులు నమోదై విచారణ జరుగుతోంది. ఈ రెండు ఘటనలు జక్కంపూడి కుటుంబం దగ్గరుండి జరిపించినట్టు, వారే వీటికి బాధ్యులన్నట్టు ఆవేశ పడిపోవడం ఎందుకో అర్థం కాదు. తన రాజకీయ ప్రత్యర్థిని బదనాం చేయడానికి, తాను ప్రచారం పొందడానికి చేసిన ఆరోపణలుగా ఉన్నాయి తప్ప ఓ మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతంగా చేసిన వ్యాఖ్యల్లా లేవు. మేము బురద జల్లుతాము మీరు కడుగుకోండి అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం.
ఓ ఫార్సుగా సత్య ప్రమాణం..
టీడీపీ నేతలు సత్య ప్రమాణాన్ని ఓ ఫార్సుగా మార్చేశారు. ఇదే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గతంలో ఇలాగే అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిపై ఇలాంటి అడ్డదిఢ్ఢమైన ఆరోపణలే చేశారు. బిక్కవోలు వినాయకుడి ఆలయంలో సత్య ప్రమాణం చేద్దాం రండని సవాళ్లు విసిరారు.
Also Read : ఏ జాబు బూటకం బాబూ..?
ఆ సవాలును స్వీకరించి ఎమ్మెల్యే సతీ సమేతంగా వచ్చి తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని దేవుడి ముందు సత్య ప్రమాణం చేశారు. ఆరోపణలు చేసిన రామకృష్ణారెడ్డి మాత్రం అప్పటి వరకు బింకం ప్రదర్శించి తన వంతు వచ్చే సరికి సత్య ప్రమాణం చేయకుండా తోక ముడిచి నవ్వుల పాలయ్యారు. అయితే అప్పటి నుంచి ఈ సత్య ప్రమాణాల సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఓ ట్రెండులా మారాయి. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఈ తరహా సవాళ్లు మనం చూశాం.
మరి రాజకీయ ప్రమాణాలో..
రాజకీయాల్లో ప్రమాణాలు రానురాను దిగజారిపోతున్నాయన్న వ్యాఖ్యలు మనం తరచూ వింటున్నవే. ఏ మాత్రం బాధ్యత లేకుండా నాయకులు చేసే ఇటువంటి వ్యాఖ్యల వల్లే వారు జనంలో పలుచన అవుతున్నారు. కనీస రాజకీయ ప్రమాణాలు పాటించకుండా విమర్శలు చేస్తే సొంత పార్టీ వారే సందేహించే పరిస్థితి వస్తుంది.
ఎప్పుడో ఇలా ప్రెస్ మీట్ లో దర్శనం ఇచ్చే ఈయన జనానికి, నియోజకవర్గానికి దూరంగా, ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారని పేరు. అందుకే గడచిన ఎన్నికల్లో జనం పెందుర్తి వెంకటేష్ ను అధికారానికి దూరం పెట్టి జక్కంపూడి రాజాను భారీ మెజార్టీతో గెలిపించారు. రాజకీయాల్లో రాణించాలంటే జనం మధ్య ఉండాలి తప్ప ఇలా జనం నోళ్ళలో నానితే చులకనైపోతారే కానీ ఫలితం ఉండదని గ్రహిస్తే నేతలకు మంచిది.
Also Read : మహేష్‌బాబు మురారీ సినిమా షూటింగ్ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?