తమిళనాడులో అధికారానికి దూరమైన అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. ఇటు ఈపీఎస్, ఓపీఎస్.. అటు చిన్నమ్మ శశికళ పార్టీపై పెత్తనం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తుండటంతో.. ఆ పార్టీ అంతర్గత రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా శశికళ పార్టీ నేతలతో ఫోన్ మంతనాలు సాగిస్తుంటే.. ఎడప్పాడి, పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలతో సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఫోన్ సంభాషణల ఆడియో చక్కర్లు
రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ సంభాషణలతో కూడిన ఓ ఆడియో క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఆనందన్
తో దివంగత జయలలిత నిచ్చెలి శశికళ నెరిపిన ఫోన్ సంభాషణ అది. ఐదు నిమిషాల నిడివి కల్గిన ఆ ఆడియోలో.. ‘పార్టీ నా ప్రాణం.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. ఎంజీఆర్ మరణానంతరం జయ, నేను కలిసి పార్టీని నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డాం. అటువంటి పార్టీని ఇప్పుడు ఓడిపోయేలా చేశారు. మళ్లీ నేనొస్తాను. పార్టీని గాడిలో పెడతాను. అంతవరకు కార్యకర్తలు ఓపిక పట్టాలి’..అని చిన్నమ్మ చెప్పినట్లు ఉంది. కార్తెకుడి జిల్లాకు చెందిన పార్టీ నేత ప్రభాకరన్ తోనూ శశికళ మాట్లాడారు.
ఫోన్ ద్వారా పార్టీ నేతలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్న ఆమె ఇప్పటికే 20 మందికిపైగా నేతలతో మాట్లాడినట్లు పార్టీవర్గాలు చెప్పుకొంటున్నాయి. మరోవైపు పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చిన్నమ్మను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేపట్టి.. కార్యకర్తలతో మమేకం కావాలని శశికళ ఆలోచిస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గి, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ పర్యటన ఉంటుందని అంటున్నారు.
లోపించిన ఐక్యత
శశికళ ఎత్తులను.. ఆమె కదలికలను నిశితంగా గమనిస్తున్న అన్నాడీఎంకే అగ్రనేతలు పార్టీ తమ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 14న పార్టీ ఎమ్మెల్యేతో సమావేశ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు తప్ప ఇతరులకు ప్రవేశం లేదని పేర్కొన్నారు. శశికళను ఎదుర్కొనే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వివాదం కోర్టులో ఉండటంతో పార్టీ సమన్వయకర్తగా పళనిస్వామి, సంయుక్త సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం వ్యవహరిస్తున్నారు.
వీరిద్దరూ ఉమ్మడిగా పార్టీ వ్యవహారాలు చూస్తున్నా.. కిందిస్థాయిలో కార్యకర్తలు మాత్రం పన్నీరు, పళని వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు అన్నట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలో పన్నేరుసెల్వంకు అనుకూలంగా పోస్టర్లు వేయడంతో పళని వర్గీయులు రగిలిపోతున్నారు. ఈ పరిణామాలు పార్టీలో గందరగోళానికి తావిస్తున్నాయి. దాంతో చాలామంది చిన్నమ్మ వైపు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : భారత్ బయోటెక్ కు అమెరికాలో ఎదురుదెబ్బ