డొనాల్డ్ ట్రంప్ ఆ పేరు చెబితే..సంచలనానికి, వివాదాస్పదానికి మారుపేరు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటి నుండి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇతర దేశాలతో కయ్యానికి కాలుదువ్వారు. పారిశ్రామిక వేత్తలతో గొడవులు, సోషల్ మీడియా అధిపతులతో విభేదాలు ఇలా అందరితో వివాద ఉన్న ఏకైక నేత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయనకు అనుకూలంగా లేకపోవడంతో సోషల్ మీడియాపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్…ఆయా సంస్థల అధిపతుల నుండి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. ట్రంప్ వైఖరిపై ఇటీవలి ట్విట్టర్ సిఈఓతో విమర్శలు గుప్పించారు. ఒక దశలో ట్రంప్ వర్సెస్ ట్విట్టర్ అనేంత స్థాయికి వివాదం జరిగింది. తాజాగా ఫేస్బుక్ అధినేత ట్రంప్ సర్కార్ విమర్శల వర్షం కురిపించారు.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సిఈఓ మార్క్ జుకర్ బర్గ్ డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ సంక్షోభంపై ట్రంప్ ప్రభుత్వ వైఖరిపై నిరాశను వ్యక్తం చేశారు. కోవిడ్-19 నియంత్రణలో అనేక ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తీరు ఘోరంగా ఉందన్నారు. ప్రాథమిక నిబంధనలు అమలుతోపాటు, సమగ్ర నివారణ చర్యలు తీసుకొని ఉంటే జూలైలో రెండవ దశ కరోనాను నివారించే అవకాశం ఉండేదన్నారు.
అమెరికాకు చెందిన అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఇంటర్వ్యూలో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ కరోనా నిర్ధారిత పరీక్షలు ఇప్పటికీ తగినన్ని అందుబాటులో లేకపోవడం నిజంగా నిరాశ కలిగించిందన్నారు. ప్రజారోగ్య చర్యలపై శాస్త్రవేత్తల సలహాలను పాటించడం లేదనీ, నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. దీంతో దేశంలోని టాప్ సైంటిస్టుల, సిడిసి విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కరోనా కేసుల నమోదు తక్కువ స్థాయిలో ఉంటే, అమెరికాలో మాత్రం రోజువారీ రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాంతక వ్యాధి కట్టడిలో అనేక ఇతర దేశాలు తీవ్రంగా కృషి చేసినప్పటికీ, అమెరికా ఈ విషయంలో వెనుకబడిందని వ్యాఖ్యానించారు. భౌతిక దూరం, మాస్క్‌లు ధరించడం, లాంటి ఇతర భద్రతా చర్యలు తీసుకోకుండానే చాలా రాష్ట్రాలు నిబంధనల ఎత్తివేతకు, ఆర్థిక కార్యలాపాల పునరుద్ధరణకు తొందర పడ్డాయని డాక్టర్ ఫౌసీ అభిప్రాయ పడ్డారు.
దీంతో ఆయా రాష్ట్రాలలో వైరస్ రెండవ దశ విజృంభణకు దారితీసిందన్నారు. కాగా కరోనా వైరస్‌పై తన వినియోగదారులకు విశ్వసనీయ సమాచారాన్ని అందించేందుకు పలువురు శాస్త్రవేత్తలు , ఆరోగ్య నిపుణులతో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.