ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు వారిలో అవగాహన కల్పించడం మీడియా బాధ్యత, అపోహల్లో ఉన్నప్పుడు వారిలో చైతన్యం కల్పించే ప్రయత్నం చేయడం మీడియా చేయాల్సిన పని. కానీ ఆంధ్రప్రదేశ్ లో అయితే అందుకు భిన్నం. ఇక్కడ కొన్ని ప్రధాన మీడియా హౌసుల వ్యవహారం విడ్డూరంగా ఉంటుంది. చంద్రబాబు పాలన అయితే అన్ని సమస్యలను కప్పిపుచ్చేసే మీడియానే ఇతరులు సీఎం అయితే మాత్రం అన్నింటినీ భూతద్దంలో చూపిస్తుంది. అదే సమయంలో బాధ్యతారాహిత్యంగా సాగుతుంది. అందుకు తాజా ఉదాహరణగా ఏలూరు ఘటన చూడవచ్చు.
నగరంలో సమస్య వచ్చింది. అనేక మందిలో మూర్ఛ తరహాలో స్పృహ కోల్పోతున్న సమస్య కనిపిస్తుండగా, మరికొందరు వాటి ప్రభావంతో ఆందోళన మూలంగా మానసిక సమస్యలు కనిపిస్తున్నాయి. భయాందోళనతో ముందు జాగ్రత్త కోసమే అనేక మందిని ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని బాధితుల బంధువులు, వైద్యులు, నిపుణులు అంతా అంగీకరిస్తున్నారు. అలాంటి సమయంలో వారిని శాంతిపరిచేలా మీడియా కథనాలు ఉండాలి. ఉపశమనం కలిగించేలా వాస్తవాలు చెప్పాలి. కానీ ప్రస్తుతం ఏలూరులో ఎవరికైనా బంధువులుంటే బతికి ఉన్నారా లేదా అనే అనుమానం ఇతర ప్రాంత వాసుల్లో కలిగించే స్థాయిలో కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి ఏలూరులో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం వెంటనే స్పందించడం ఫలితాన్నిస్తోంది. ఇప్పటి వరకూ 400 మందికి పైగా ఆస్పత్రి పాలయితే అందులో 200 మందిని డిశ్ఛార్జ్ చేశారు. మరో 150 మందిలో ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. కేవలం 16 మందికి మాత్రమే వైద్యం అందించాల్సి వస్తోంది. దాంతో వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ కేవలం ఒక్కరే ప్రాణాలు కోల్పోయారు. ఆయన కూడా స్వల్ప వ్యవధిలో వరుసగా మూడు సార్లు ఫిట్స్ బారిన పడడంతో మరణించినట్టు బంధువులు చెబుతున్నారు. మిగిలిన వారంతా కోలుకుంటూ ఎటువంటి సమస్య లేకుండా సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. కొందరు రోజువారీ పనులకు కూడా హాజరవుతున్నారు.
అదే సమయంలో స్వయంగా సీఎం బాధితులను పరామర్శించారు. అధికారులతో సమీక్షించారు. కేంద్రం అప్రమత్తమయ్యింది. పలు బృందాలను పంపిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ కూడా దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో మీడియా సామాన్యులను కలవరపరిచే కథనాలు వండి వార్చడం విడ్డూరంగా మారింది. అదే సమయంలో టీడీపీ నేతలు తమదైన విచిత్ర వాదనలకు దిగుతున్నారు. చంద్రబాబు వాదన ప్రకారం మంచినీటి సరఫరా లోపాల కారణంగా ఇలాంటి సమస్య ఉత్పన్నమయ్యిందని భావించాలి. కానీ ఆయన చెప్పిన దానికి భిన్నంగా మినరల్ వాటర్ తాగుతున్న వాళ్లు , మునిసిపల్ వాటర్ కాకుండా బోరు నీళ్లు తాగుతున్న దెందులూరు వాసులు కూడా ఇలాంటి సమస్యతో ఆస్పత్రి పాలుకావడం చూస్తుంటే బాబు వాదనలో డొల్లతనం బయపడుతుంది. పైగా తమ పాలనలో ఏలూరు ఎంతో బాగుందనే భ్రమల్లో ఉన్న బాబు ఈ 18 నెలల్లోనే ఏదో లోపం జరిగిందనే రీతిలో వాదనలు చేస్తుండడం ఏలూరు వాసులను కూడా విస్మయానికి గురిచేస్తోంది.
ఏలూరులో సమస్య ఉన్న మాట వాస్తవం. దానికి కారణాలు ఇంకా స్పష్టత రాలేదన్నది నిజం. అయినా విపక్షాలు విడ్డూరంగా వాదనలు చేయడం, దానికి వంతపాడుతున్న మీడియా కథనాలు మాత్రం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కానీ ఏలూరు వాసులు వాటిని పెద్దగా ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. నగరంలో సాధారణ జీవనం సాగుతోంది. ఇతర వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుంటున్నారు. ఇక కొన్ని గంటల్లోనే సాధారణ స్థితి వస్తుందనే ఆశాభావం అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది.