అడుసు తొక్కనేల..కాళ్లు కడగనేల అన్నది పాత సామెత. వార్త అల్లడమేలా.. వివరణ ఇచ్చుకోవడమేలా అన్నట్టుగా మారింది ఈనాడు తీరు. ఒకప్పుడంటే ఈ రెండు పత్రికల ఎలివేషన్స్ వేరుగా ఉండేవి. దేన్నయినా నంది అంటే జనం నంది అనుకునేలా ఉండేది. కాదు..కాదు పంది అంటే ఓహో పంది అనుకునేలా పబ్లిక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మీడియా విస్తరించింది. దానికి మించి సోషల్ మీడియా చెలరేగుతోంది. దాంతో ఒకనాడు తమకు నచ్చిన నేతలను విజనరీ అని..పరిపాలనాదక్షుడని ఎంతో కవరప్ చేసిన వారికిప్పుడు కష్టం అవుతోంది. తమ గిట్టని వారిని ఫ్యాక్షనిస్టులని, అవినీతిపరులను వేసిన ముద్రలకు ఇప్పుడు అవకాశం లేకుండా పోతోంది. దాంతో ఉద్దేశపూర్వకంగా ఏదయినా కథనం ప్రచురించినా లేదా ప్రసారం చేసినా పెద్ద తలనొప్పి తప్పడం లేదు. అలాంటి పరిస్థితే ఈనాడుకి ఎదురయ్యింది. ఇప్పుడు వివరణలతో సరిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులకు సంబంధించిన కీలక బిల్లుల ఆమోదానికి గవర్నర్ సన్నద్ధమవుతున్న వేళ ఈనాడు ఓ కథనం ప్రధానంగా ప్రచురించింది. దాని ప్రకారం విశాఖ నగరం భూకంపాల జోన్ లో ఉంది. సముద్రంలో ఏర్పడిన చీలికలతో శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని పేర్కొన్నారు. తద్వారా విశాఖ రాజధాని ఎంపిక సరికాదన్నది ఈనాడు పరోక్షంగా చెప్పాలనుకున్న అంశం. ప్రజల్లో ఆందోళన కలిగించే యత్నం. కానీ వాస్తవానికి ఈనాడు ఆశిస్తున్న అమరావతి ఇప్పటికే భూంకంపాల జోన్లో ఉంది. కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పలుమార్లు భూప్రకంపనలు నమోదయిన అనుభవం ఇటీవల కాలంలో కూడా అందరికీ తెలుసు. కానీ విశాఖలో అలాంటి ఆనవాళ్లు లేకపోయినప్పటికీ అమరావతి సురక్షితం అని..విశాఖ మాత్రం ప్రమాదకరం అని చెప్పేందుకు ఈనాడు ప్రయత్నం చేయడం చాలామందిని విస్మయానికి గురిచేసింది.
సోషల్ మీడియా సాక్షిగా ఈనాడు కథనాలను పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఓ ప్రాంత ప్రజల్లో భయోత్పాతం కల్పించే ప్రయత్నం శ్రేయస్కరం కాదని పలువురు హితువు పలికారు. రాజకీయంగా కొందరు తీవ్రంగా దుయ్యబట్టారు. విశాఖలోనే ఈనాడు ప్రారంభించి, నేటికీ అక్కడ వ్యాపారాలు చేస్తున్న రామోజీరావు పత్రికలో ఇలాంటి కథనాలు ఇవ్వడంపై కస్సుమన్నారు. ఈ ప్రతిఘనతో ఈనాడు వెనక్కి తగ్గింది. నష్టనివారణ చర్యలకు పూనుకుంది. అందుకు తగ్గట్టుగానే మంగళవారం నాటి పత్రికలో వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక ఈనాడు కథనం పట్ల శాస్త్రవేత్తలు కూడా తీవ్రంగా స్పందించారు. అశాస్త్రీయ అంశాలతో అపోహలు సృష్టించే ప్రయత్నంగా కొట్టిపారేశారు. ఒక్కసారి చేసిన పరిశోధనతో మొత్తం భూమికి, సముద్రానికి అన్వయిచి చీలిక వస్తుందనే నిర్ధారణకు రావడం సరికాదని చెబుతున్నారు. జాతీయ సముద్ర అధ్యయన సంస్థ చీఫ్ సైంటిస్ట్ ఈ వాదనను కొట్టిపారేశారు. అలాంటి అవకాశం లేదన్నారు. దీనిపై ఎన్ఐఓ పరీక్షలు చేస్తోందన్నారు. ఓఎన్జీసీ ,హెచ్ సీ యూ చెప్పినట్టు సాగుతున్న ప్రచారం నిరాధారమన్నారు. ఇలా అటు శాస్త్రీయంగానూ, ఇటు రాజకీయంగానూ ఈనాడు కథనం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం విశేషం.