అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు అదుపు తప్పుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా మూడు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై రాజా క్షమాపణలు చెప్పినప్పటికీ ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. చర్యలకు ఉపక్రమించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఎ.రాజాపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తాయని తేల్చిచెప్పింది. అందుకు శిక్షగా 48 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంకే స్టార్ ప్రచారకుల జాబితా నుంచి రాజా పేరును తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ ప్రచారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, మహిళల పట్ల అసభ్యంగా, అవమానకరంగా, వారి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడరాదని సూచించింది.
ప్రచారానికి దూరం
ఈసీ ఆదేశాలు తక్షణం అమలులోకి వచ్చాయి. దీంతో ఆయన గురువారం మధ్యాహ్నం నుంచి ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. అలాగే శనివారం మధ్యాహ్నం వరకు ప్రచారం, బహిరంగసభల్లో రాజా పాల్గొనడానికి వీలులేదు. ఇటీవల ఓ బహిరంగసభలో ముఖ్యమంత్రి పళనిస్వామిని విమర్శిస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలు సీఎం మాతృమూర్తిని అవమానించేలా ఉన్నాయంటూ మహిళా సంఘాలు, ప్రత్యర్థి పార్టీల నేతలు మండిపడడంతో రాజా క్షమాపణ కూడా చెప్పారు. అన్నాడీఎంకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, వీడియో ఫుటేజీని పరిశీలించిన ఈసీ.. ఆయనపై చర్యలు చేపట్టింది.
అవకాశంగా మార్చుకుంటున్న బీజేపీ
రాజా వ్యాఖ్యలను బీజేపీ ప్రచారంలో తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దీనిపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవభావం లేని డీఎంకే నేతలకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ-అన్నాడీఎంకే అభ్యర్థులకు మద్దతుగా గురువారం తిరుక్కోవిలూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజా ముఖ్యమంత్రి మాతృమూర్తిని కించపరిచేలా విమర్శలు చేశారని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఇలాంటి హేయమైన మాటలతో డీఎంకే నేతలు విమర్శలు చేయడం ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. మహిళామూర్తులను కించపరుస్తున్న డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు.