బాలీవుడ్లో రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), రియా చక్రవర్తి సహా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఇటీవల అరెస్ట్ చేసిన విషయం విదితమే. తాజాగా ఈ కేసులో మరికొందరు ప్రముఖుల పేర్లు తెరపైకొచ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపిస్తోంది. రియా చక్రవర్తి, విచారణ సందర్భంగా వెల్లడించిన పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వుందనీ, త్వరలోనే ఎన్‌సిబి, రకుల్ ప్రీత్‌ని విచారించే అవకాశముందనీ తెలుస్తోంది. కాగా, కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇద్దరు హీరోయిన్లను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరైన రాగిణి ద్వివేదికి తెలుగు సినిమాలతో పెద్దగా పరిచయం లేకపోగా, సంజజన మాత్రం తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఓ దర్శకుడితోపాటు పలువురి పేర్లను సంజన వెల్లడించిందనీ, సంజన కేసులోనూ తెలుగు సినీ ప్రముఖులకు షాక్ తప్పకపోవచ్చనీ అంటున్నారు. అయితే, ఈ ప్రచారంలో నిజమెంత.? అన్నది తేలాల్సి వుంది. గతంలో టాలీవుడ్‌కి సంబంధించి డ్రగ్స్ ఆరోపణలు రాగా, పలువుర్ని విచారించారు. అయితే, అప్పట్లో సినీ పరిశ్రమకు సంబంధించి ఎవర్నీ అరెస్ట్ చేయలేదు. తెరవెనుక రాజకీయ మంత్రాంగం నడవడం వల్లే అప్పట్లో అరెస్టులు జరగలేదన్న వాదనలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. కాగా, రియా చక్రవర్తి వెల్లడించిన పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరుతోపాటు సారా అలీఖాన్ పేరు కూడా వినిపిస్తుండడం గమనార్హం.