ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పదే పదే అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చివరకు డీజీపీ, సీఎస్ కూడా హైకోర్టు లో హాజరుకావాల్సి వస్తోంది. లీగల్ గా ఉన్న వ్యవహారాలను అడ్డుపెట్టుకుని కొందరు వేస్తున్న పిటీషన్ల పరంపరలో ఇది అనివార్యంగా మారుతోంది. దాని ప్రభావంతో ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం అవుతోంది. మరికొన్ని సందర్భాల్లో అధికారులకు శిక్ష పేరిట సాయంత్రం వరకూ కోర్టు హాల్లోనే ఉండేలా కొన్ని నిర్ణయాలు కోర్టు తీసుకుంటుంది. ఇది పెద్ద చర్చనీయాంశం అవుతోంది.
ఇది కేవలం ఏపీకే పరిమతం కాలేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారులు కోర్టు కేసుల్లో చిక్కుకున్న సమయంలో ఈ సమస్య తలెత్తుతోంది. దాంతో దానిపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. కీలక ఆదేశాలు వెలువరించింది. అధికారులను అనవసరంగా కోర్టులకు పిలవొద్దని స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం మార్గనిర్దేశకాలు కూడా జారీ చేసింది.
ప్రభుత్వాధికారులను ఇష్టానుసారంగా హైకోర్టులకు పిలిపించడం సరికాదని భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం మార్గనిర్దేశకాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. కొన్ని పిటీషన్ల పేరుతో అదికారులను వేధించడానికి, రాజకీయ లక్ష్యాలు సాధించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికారులను కోర్టు చుట్టూ తిప్పే ప్రక్రియ పుంజుకోవడం శ్రేయస్కరం కాదని అత్యున్నత న్యాయస్థానం భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
అధికారులను సమన్ చేసి, వారిపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని కూడా వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హేమంత్గుప్తాలతో కూడిన ప్రత్యేక బెంచ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్స్.. ఇద్దరికీ వేర్వేరు విధాలుగా అధికారాలున్నాయనే విషయం గుర్తించాలని కోర్టు పేర్కొనడం విశేషం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇరుకునపెట్టేలా కోర్టులు వ్యవహరించొద్దని కూడా ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది
రాజ్యాంగంలో శాసన, న్యాయ, అధికార వ్యవస్థలు మూడు సమానమేనని, ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని వెల్లడించింది. ఒక అధికారిని అనవసరంగా కోర్టుకు పిలవడమంటే ఉద్యోగి విధులకు భంగం కలిగించినట్టేనని అభిప్రాయపడింది. దీని వల్ల అంతిమ భారం ప్రజలపైనే పడుతుందని తేల్చిచెప్పింది. దాంతో ఇకపై న్యాయవ్యవస్థ నుంచి అధికారులకు ఒత్తిడి తగ్గుతుందా అనే చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా కేసుల పేరుతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నియంత్రణలోకి వస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో ఉన్నతాధికారులను కూడా కేసుల కారణాలను చూపించి కోర్టులకు పరిమితం చేస్తే కార్యనిర్వాహక వ్యవస్థ కార్యకలాపాలకు ఎదురయ్యే ఆటంకాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఇకపై ఎలాంటి మార్పులు ఉంటాయన్నది కీలకాంశం కాబోతోంది. ముఖ్యంగా ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఇది మరింత ప్రధానాంశంగా ముందుకు రాబోతోంది.
Also Read : ఏపీ, తెలంగాణా జలవివాదాల్లో కొరివితో తలగోక్కుంటున్న తెలంగాణా