లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన ప్రమాదంతో విశాఖ పోర్టుపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. దీనిపై నిపుణులు భరోసా ఇస్తున్నారు. లెబనాన్ ప్రమాదంతో విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న సందేహాలను నివృత్తి చేస్తూ నిజాలు వెల్లడిస్తున్నారు. విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఇక్కడ 20 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలూ జరగలేదని స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్లోడ్ చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు అని నిపుణులు, అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్ దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు. దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. విశాఖలో సురక్షితమనే కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు.
నిపుణులు ఏం చెబుతున్నారంటే…
లెబనాన్ ప్రమాదం.. విశాఖలోని పరిస్థితులపై ఏయూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కె.బసవయ్య మాట్లాడుతూ, ‘ఒకప్పుడు దేశంలోని అనేక పోర్టులకు వివిధ దేశాల నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమతయ్యేది. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్‌కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అందుకే దీని ఎగుమతి దిగుమతులపైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది.
దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు’ అని తెలిపారు. ఇక విశాఖపట్నం పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ హరనాథ్ మాట్లాడుతూ, ‘అమ్మోనియం నైట్రేట్‌తో వచ్చిన నౌకకు పోర్టులో బెర్త్ ఇవ్వాలంటే స్థానిక పోలీస్ శాఖతో పాటు కస్టమ్స్, సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక శాఖ, పెసో మొదలైన శాఖల నుంచి అనుమతులుండాలి. అన్లోడ్ జరుగుతున్నంత సేపూ బెర్త్ వద్ద ఫైర్ టెండర్ని పోర్టు సిద్ధంగా ఉంచుతుంది. ఒక్క కిలో కూడా పోర్టులో నిల్వలేకుండా ప్రత్యేక గోడౌన్లకు తరలిస్తారు. నిర్దిష్ట సమయంలో అన్లోడ్ ప్రక్రియ పూర్తిచేస్తారు.
అంతేకాక విశాఖ నుండి 35 రోజుల్లోపే ఆయా రాష్ట్రాలకు తరలిస్తారు. సురక్షితంగా హ్యాండ్లింగ్ చేసే సౌకర్యం ఉన్నందువల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. అని తెలిపారు. వీరితో పాటు విశాఖ షిప్పింగ్స్ ఎండీ శ్రవణ్ మాట్లాడుతూ, విశాఖ పోర్టులో పేలుడు జరిగే పరిస్థితులు లేవని, అమ్మోనియం నైట్రేట్‌ను ఒకేచోట ఎక్కువ కాలం ఉంటేనే పేలుడు సంభవిస్తుందని వివరించారు. తెలిపారు.
ఎటువంటి ప్రమాదమూ లేదు…
అమ్మోనియం నైట్రేట్ వల్ల నగరానికి ఎటువంటి ప్రమాదం లేదని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహన రావు తెలిపారు. అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి విశాఖ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. విశాఖ పోర్టులో గత దశాబ్దన్నర కాలం నుంచి పూర్తి భధ్రతా ప్రమాణాలతో అమ్మోనియం నైట్రేట్‌ని రష్యా, ఉక్రేయిన్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అమ్మోనియం నైట్రేట్‌ని బొగ్గు గనులలో వినియోగిస్తారని రామ్మోహన రావు తెలిపారు. విశాఖ పోర్టులో కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. షిప్ వచ్చే ముందు పోర్టుకి సమాచారం వస్తుందని.. అన్ని అనుమతుల తర్వాతే హ్యాండ్లింగ్‌కి అనుమతిస్తామన్నారు. అమ్మోనియం నైట్రేట్ గురించి విశాఖ ప్రజలు అపోహ పడవద్దని రామ్మోహనరావు కోరారు.