గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు పట్ల ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం తమదైన వ్యూహాల్ని అనుసరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు దూకుడుని ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం తామేమీ తక్కువకాదన్నట్లు వ్యవహరిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలు: సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఇప్పటికే గ్రేటర్ ప్రచారం హీటెక్కింది. ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు దేనికీ వెనకాడడం లేదు. ప్రధాన పోటీదారులుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఎంఐఎం, బీజేపీలు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమన్నట్లు తలపడుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం తనదైన శైలిని ప్రదర్శిస్తోంది. అభివృద్ధి నినాదాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది.
టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను భుజాలకేసుకున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచీ తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో పదే పదే హైదరాబాద్ అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి గత ప్రభుత్వాలెప్పుడూ చేయలేదని చెప్పుకొస్తు్న్నారు. ఆరేండ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి ని సాధించిందని, మంచినీళ్లు, కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నామని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు పేకాట క్లబ్, గుడుంబా గబ్బు, పోకిరీల ఆటలు లేవంటూ తమది జనరంజకమైన పాలన అని చెప్పే ప్రయత్నంచేస్తున్నారు.
మరోవైపు…. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతం కేంద్రంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సై అంటే సై అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో రక్తికట్టిస్తున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పైనా కత్తులు నూరుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎంల దోస్తీని బీజేపీ తప్పుబడ్తుతుంటే, ఎంఐఎం మాత్రం టీఆర్ఆర్ పై యుద్ధానికి సిద్ధమన్నట్లే వ్యవహరిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండడంతో గులాబి పార్టీని ఢీకొట్టేందుకు ఎంఐఎం దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల ఈ మాటల యుద్ధంతో గ్రేటర్ పోటీ ఓటర్లకు పరీక్షగా మారింది.
జీహెచ్ఎంసీ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగరేయాలనుకుంటున్న టీఆర్ఎస్ ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తోంది. మంత్రి కేటీఆర్ తొలిరోజు నుంచీ అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? అంటూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ ను సేఫ్ సిటీగా పేర్కొంటూ, అది టీఆర్ఎస్ వల్లే సాధ్యమైందని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. గ్రేటర్ నోటిఫికేషన్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి హైదరాబాద్ నగరం సేఫ్ సిటీగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని ప్రకటించారు. నగరంలో ఐదులక్షలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నిరంతర నిఘా వల్ల నేరస్థులకు ఇక్కడ క్రైమ్ చేయాలంటే వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసేందుకు హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీయాలని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు.
టీఆర్ఎస్ అభివృద్ధి నినాదాన్ని బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుబడుతోంది. టీఆర్ఎస్ అభివృద్ధిని కుటుంబ అభివృద్ధిగా అభివర్ణిస్తున్నాయి. ఇక సేఫ్ సిటీ, బ్రాండ్ ఇమేజ్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఘాటునే స్పందించింది. టీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆలేరు ఎన్ కౌంటర్ ను ప్రస్తావిస్తూ ఇదేనా శాంతి అంటే అని ప్రశ్నించింది. సేఫ్ సిటీలో మహిళల రక్షణ ఎందుకు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఎదురుదాడికి దిగింది. నగరంలో రోడ్లు, డ్రైనేజిలు, ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావిస్తూ ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని క్వశ్చన్ చేసింది. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి టీఆర్ఎస్ కు గట్టి ఎదురుగాలే వీస్తోందని అర్థమవుతోంది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్ లో రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించి, వాటిని హైదరాబాద్ ప్రచారంలో వినియోగించుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయించం కోసం పక్కా ప్రణాళిక రచించారని, అందుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దు. శాంతిభద్రతల పరిరిక్షణలో రాజీ పడేదిలేదని, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పరోక్షంగా బీజేపీని ఉద్దేశించినవి స్పష్టంగానే అర్థమవుతోంది.
నిజానికి హైదరాబాద్ నగరంలో గత కొన్నేళ్లుగా మత పరమైన కలహాలు చోటుచేసుకోలేదు. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావించింది. కానీ… ఎంఐఎం, బీజేపీల మాటల యుద్ధం ఇప్పుడు వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ముఖ్యమంత్రి కుండబద్ధలు కొట్టారు. అభివృద్ధి కావాలా ? అరాచకం కావాలా? అంటూ మొదలు పెట్టిన టీఆర్ఎస్ ప్రచారం అరాచకాన్ని సహించమనే హెచ్చరిక వరకు వచ్చింది. హైదరాబాద్ ఇమేజ్ కి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమంటోంది. మొత్తానికి టీఆర్ఎస్ ఎత్తుకున్న సేఫ్ సిటీ క్యాంపెయిన్ కలిసొస్తుందో లేదో వేచిచూడాలి.