అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యానికి అడుగులు పడుతున్న ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణకు సంబంధి కూడా పకడ్బందీ ప్రణాళికలు అమలవుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దిశ సంఘటన జరిగిన తర్వాత మహిళల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి కఠిన చట్టాలు, నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు 2019, డిసెంబరు 13న ఏపీ అసెంబ్లీ దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. మహిళలపై అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ రానుంది.
సమర్ధవంతంగా అమలు జరిగేలా…
ఏ కార్యక్రమం చేపట్టినా ప్రారంభించామా.. వదిలేశామా.. అన్న రీతిలో కాకుండా సీఎం జగన్ వాటి అమలు తీరును, లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అవసరమైనప్పుడు సమీక్షలు చేస్తూ లక్ష్య సాధనకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటి అమలుకు సంబంధించిన అడ్డంకులను అధిగమించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రత్యేక కోర్టులకు సంబంధించిన ఫైలు కేంద్రం హోం శాఖ వద్ద పెండింగ్ లో ఉందని తెలుసుకున్న జగన్ తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దిశ చట్టం కింద కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి గతంలోనే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లను, ఫోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను అధికారులు నియమించారు. మిగిలిన చోట్ల కూడా ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్ ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.
దిశపై మరింత ప్రచారం.. పరిష్కారం..
దిశ చట్టం రూపకల్పనతో పాటు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం సంబంధించిన వివరాలను, నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలలో అందుబాటులో ఉండేలా పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ దిశ పెట్రోలింగ్ వ్యవస్థను ప్రారంభించింది. అందులో భాగంగా 900 స్కూటర్లను ఏర్పాటు చేసింది. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ దిశ మహిళా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్ నంబర్ ఉంటుంది. సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుంది. ప్రభుత్వం ప్రచారంతో దిశ యాప్ ఇప్పటి వరకూ సుమారు 11.23 లక్షల డౌన్ లోడ్ లను పూర్తి చేసుకుంది. వేలాది మంది బాధితులు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన 7 రోజుల్లోనే చార్జీషీటు దాఖలు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ సుమారు 80 వరకూ కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో మరణ శిక్షలు 3, జీవిత ఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, పదేళ్ల శిక్ష 5, ఏడేళ్లపైన 10, ఐదేళ్ల లోపు శిక్షలు మిగతా కేసుల్లో ఉన్నాయి. మరో 1100కు పైగా కేసుల్లో చార్జిషీటు దాఖలై విచారణలో ఉన్నాయి.