ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి (67) క్యాన్సర్‌తో చనిపోయింది. కాని ఆమె బతుక్కు, చావుకు మధ్య చివరి రోజుల్లో చోటు చేసుకున్న అమానవీయం అనేక ప్రశ్నలకు సమాజానికి సంధిస్తోంది. ఒక్క కొడుక్కు తప్ప ఆమెను ఏ ఒక్కరూ ఆదరించలేదు. వెంకటలక్ష్మి క్యాన్సర్‌తో చనిపోయి ఉండొచ్చు. పుట్టిన వారు గిట్టక తప్పదని గీతలో శ్రీకృష్ణుడు ఏనాడో చెప్పాడు. అనివార్యమైన చావుకు శోకింప కూడదని కూడా ఆయనే చెప్పాడు.
కానీ వెంకటలక్ష్మి మరణం కంటే కూడా ఆమె ప్రాణాలు విడిచిన తీరు సభ్యసమాజాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. వెంకటలక్ష్మిని పట్టి పీడించిన క్యాన్సర్ చివరికి ఆమె ప్రాణాలను తీసుకెళ్లింది. కానీ సమాజానికి పట్టిన క్యాన్సర్ మాటేమిటి? ఒక మనిషి క్యాన్సర్‌తో బాధపడుతూ, కనీసం ప్రశాంతంగా ప్రాణాలు విడిచే పరిస్థితి కూడా లేని దయనీయ, అమానవీయ సమాజంలో బతుకుతున్నామంటే భయంతో ఒళ్లంతా కంపిస్తోంది. మనిషిగా పుట్టినందుకు సిగ్గుగా ఉంది. వెంకటలక్ష్మిపై సమాజ నిరాధరణ చూస్తే…రేపు ఎవరి పరిస్థితి అయినా అంతే కదా అనే అనుమానం కలుగుతోంది.
తెలంగాణ జానపద కళాకారుడు అందెశ్రీ పాట గుర్తుకొస్తోంది.
మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు
అవును ఈ రెండు వాక్యాలు సమాజ పతనావస్థకు ప్రతిబింబాలుగా నిలిచాయి. దానికి నిలువెత్తు నిదర్శనంగా వెంకటలక్ష్మి ఉదంతం నిలుస్తోంది.
ప్రకాశం జిల్లా పామూరులో అద్దె ఇంట్లో వెంకటయ్య, వెంకటలక్ష్మి , వారి కుమారుడు సతీష్ నివాసం ఉంటున్నారు. నాలుగేళ్లుగా వెంకటలక్ష్మి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించింది. కొడుకు సతీష్ ఎంతో బాధ్యతతో, ప్రేమతో తల్లిని చూసుకున్నాడు. తల్లి వైద్యానికి రూ.4 లక్షలు ఖర్చు చేశాడు.
ఆరోగ్యం క్షీణించిన తల్లిని పామూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఈ నెల 18న తీసుకెళ్లాడు. రిమ్స్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు సలహా కేంద్రాలుగా తప్ప వైద్యం అందించడం ఎప్పుడో మరిచిపోయాయి. దీంతో అతను తల్లిని తిరిగి ఇంటికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో ఇంటి యజమాని కనిపించారు.
తన ఇంటికి తీసుకురావద్దని తెగేసి చెప్పారు. అప్పుడా క్షణంలో ఏం చేయాలో అతనికి దిక్కుతోచలేదు. మళ్లీ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తాము వైద్యం అందించలేమని అక్కడి వైద్యులు తేల్చి చెప్పారు. అక్కడి నుంచి “చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం”లో పంచాయతీ అధికారులు ఇచ్చిన గదిలో ఆ రాత్రికి తల్లితో కలసి ఉన్నాడు. తెల్లారి 19వ తేదీ అక్కడి సిబ్బంది వచ్చి ఖాళీ చేయాలని సూచించారు. దీంతో అక్కడి నుంచి చేతులపై మోసుకెళుతూ పామూరులోని పార్కుకు అతికష్టం మీద తల్లిని తీసుకెళ్లాడు.
పార్కులో టెంట్ వేసి తల్లికి షెల్టర్ కల్పించాడు. రాత్రి 8 గంటల వరకూ అక్కడే తల్లితో పాటు ఉన్నాడు. ఈ విషయం ఎలాగోలా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ తల్లికి వైద్యం అందించాలని పామూరు వైద్యాధికారిని ఉన్నతాధికారులు ఆదేశించారు. అప్పుడు ఆ తల్లిని వైద్య సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు. అనంతరం ఈ నెల 20న ఆ తల్లి శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లింది. కానీ మరణించింది వెంకటలక్ష్మా లేక మానవత్వమా? క్యాన్సర్ సోకింది వెంకటలక్ష్మికా లేక సమాజానికా?
మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడ ఉన్నడో కంటికి కానరాడు.
నిలువెత్తు స్వార్థమూ…
నీడగా వస్తూ చెడిపోక ఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమసంబంధాల దిగుజారుతున్నడమ్మా అని అందెశ్రీ రాసిన అద్భుతమైన పాట మానవత్వం ఉన్న వారికి ఓ ఓదార్పు లాంటిది.
అందెశ్రీ చెప్పినట్టు యాడ ఉన్నదో కంటికి కానరాని మానవత్వం ఉన్నచోటికి వెళ్లిన ఆ వెంకటలక్ష్మీనే ధన్యజీవి అనిపిస్తోంది. అమ్మా నీ మరణమైనా శవంలా మారిన మానవత్వం ప్రాణం పోసుకుంటే బాగుంటుంది.