టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి చాలా తేడానే ఉంటుంది. ఇద్దరూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆమాటకొస్తే ఇద్దరూ రాయలసీమ ప్రాంతం వారే. ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన వారే. 1980లో ఇద్దరూ ఒకేసారి అంజియ్య కాబినేట్ లో మంత్రులు అయ్యారు. 1995లో వైస్రాయ్ ఉదంతం నడిపి చంద్రబాబు ముందు ముఖ్యమంత్రి అయి మొత్తంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అలాగే 11 సంవత్సరాలు (నేటికి) ప్రతిపక్షనేతగా పనిచేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా, 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ హోదాలో ఉండగానే దివంగతులైయ్యారు. అయితే ప్రజలకు కానీ, అధికార యంత్రాంగానికి కానీ ఈ ఇద్దరిలో రాజశేఖర్ రెడ్డి పట్ల అభిమానం ఎక్కువ. బహుశా అలాంటి అభిమానం చంద్రబాబుకు దొరక్కపోవచ్చు.
ఇద్దరి వ్యవహార శైలిలో కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ తేడాలు వ్యక్తిగత సంబంధాల్లోనూ, పరిపాలనలోనూ కొంత స్పష్టంగా కనిపిస్తాయి. పరిపాలన విషయంలో చంద్రబాబుది కార్పొరేట్ స్టైల్. ఒక కంపెనీ సీఈఓ ఎలా పనిచేస్తారో చంద్రబాబు కూడా అలాగే పనిచేస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా మాటల్లో చెప్పాలంటే ఏ పని చేసినా, “ఇది నాకెందుకు చెప్పలేదు?” అని చంద్రబాబు అధికారులను ప్రశ్నిస్తారు. అధికారులకు నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. ఆ మాటకొస్తే ప్రతి నిర్ణయం చంద్రబాబు ద్వారానే జరగాలి. అది చిన్న విషయం అయినా, పెద్ద విషయం అయినా, నిర్ణయాధికారం చంద్రబాబుదే. అధికారులే కాదు, మంత్రులు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వరు చంద్రబాబు. కేంద్రీకృత పరిపాలన (సెంట్రలైజడ్ అడ్మినిస్ట్రేషన్) ఆయన విధానం.
రాజశేఖర్ రెడ్డి అలా కాదు. అత్యంత కీలకమైన విషయాలు మాత్రమే ఆయన నిర్ణయం తీసుకునే వారు. తన విధానం ఆయన చెప్పేవారు. తన విధానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే స్వేఛ్చ అధికారులకు, మంత్రులకు, పార్టీ నేతలకు ఇచ్చేవారు. ఎవరైనా అధికారులు ఏదైనా చెపితే “ఇది నాకెందుకు చెపుతున్నారు?” అంటూ రాజశేఖర్ రెడ్డి ఎదురు ప్రశ్నించేవారు అని మోహన్ కందా చెప్పారు. అంటే ఒక విధాన నిర్ణయం ఆయన చేశాక దానికి అనుబంధంగా ఇతర నిర్ణయాలన్నీ మిగతావారు తీసుకునే స్వేచ్ఛ ఆయన ఇచ్చేవారు. ఇలాంటి స్వేచ్ఛలో కొంత పనిపట్ల తృప్తి ఉంటుంది.
జరిగే ప్రతి పని, చేసే ప్రతి నిర్ణయం తనదై ఉండాలనే భావన చంద్రబాబుది. కానీ చేసే ప్రతి పనిలోనూ, ప్రతి నిర్ణయంలోనూ తన విధానం కనిపిస్తే చాలు అనే భావన రాజశేఖర్ రెడ్డిది. అంతా నేనే.. అంతా నాదే అనే భావన చంద్రబాబుది. అంతా మనదే అనే భావన రాజశేఖర్ రెడ్డిది.
ఇద్దరిలో కనిపించే మరో తేడా ఏమంటే… రాజశేఖర్ రెడ్డి ఆప్యాయంగా మాట్లాడతారు, నవ్వుతారు. ఒక ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నామన్న స్పృహ ఉన్నా కొంత చొరవగా మాట్లాడే అవకాశం ఇస్తారు రాజశేఖర్ రెడ్డి. వెన్ను తట్టుతారు, చేయి పట్టుకుని ఆప్యాయంగా, మృదువుగా నొక్కుతూ పలకరిస్తారు. చంద్రబాబు నాయుడిలో ఇలాంటి అనుభూతి కలగదు. ఫొటోకు పోజిచ్చినప్పుడు మినహా ఇతర సమయాల్లో ఎవరి భుజాలపైనా చంద్రబాబు చేయి వేయరు. ఆయన మోహంలో నవ్వు చాలా అరుదుగా కనిపించే దృశ్యం.
ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు అనుచరులు ఉంటారు. రాజశేఖర్ రెడ్డికి అభిమానులు ఉంటారు.