ఆంధ్రప్రదేశ్ కోస్తాకు వాయుగుండాలు, తుఫాన్లు కొత్త కాదు. రుతుపవనాల సీజనులో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫాన్లు అటు తమిళనాడు నుంచి ఇటు ఒడిశా వరకు ఉన్న ప్రాంతాల్లో తీరం దాటుతూ అపార నష్టం కలిగిస్తుంటాయి. కానీ వాటికో లెక్క ఉండేది. ఏ నెలలో తుపాన్లు ఏ రాష్ట్రంపై ప్రభావం చూపుతాయన్న దానిపై గతంలో వాతావరణ నిపుణులకు ఒక నిర్దిష్ట అంచనా ఉండేది. కానీ రానురాను వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, సాగర ఉష్ణోగ్రతల పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఆ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న జవాద్ తుఫానే దీనికి నిదర్శనం. సాధారణంగా డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు తుఫాను ముప్పు ఉండదని గతం నుంచీ ఉన్న ఓ అంచనా. దానికి భిన్నంగా జవాద్ తుఫాను విరుచుకుపడుతోంది.
నవంబర్ వరకే తుఫాన్ల సీజన్
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలకు ముందు, మధ్యలో.. తర్వాత ఈశాన్య రుతుపవనాల సీజన్లలో ఆంధ్రప్రదేశ్ తీరంలో వాయుగుండాలు, తుఫాన్లు ఏర్పడుతుంటాయి. వేసవి చివరిలో అంటే ఏప్రిల్, మే నెలల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా వాయుగుండాలు ఏర్పడుతుంటాయి. నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా ఉండే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో.. అలాగే నైరుతి నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు (పోస్ట్ మాన్సూన్) ప్రవేశించిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వరకు ఏర్పడే వాయుగుండాలు బలపడి తుఫాన్లుగా మారుతుంటాయి. నైరుతి సీజన్లో తుఫాన్లు ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో.. ఈశాన్య రుతుపవన సీజన్లో వచ్చేవి ఉత్తరాంధ్రలో తక్కువగా.. దక్షిణాంధ్ర, తమిళనాడుల్లో ఎక్కువగా తీరం దాటుతుంటాయి.
డిసెంబరులో చాలా అరుదు
డిసెంబరులో ఏర్పడే తుఫాన్లు అయితే దక్షిణ తమిళనాడు లేదా బెంగాల్, బంగ్లాదేశ్ లపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆంధ్ర తీరం దాటడం చాలా అరుదు. గత 200 ఏళ్లలో మూడు తుఫాన్ లే కోస్తా ఆంధ్రలో తీరం దాటాయి. వాటిలో రెండు గత 50 ఏళ్లలోనే విరుచుకుపడ్డాయి. అది కూడా చాలా విచిత్రంగా దిశలు మార్చుకుని మరీ దాడి చేశాయి.
2003 డిసెంబర్ 16న ఏర్పడిన తుఫాను (అప్పటికి తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం లేదు) మచిలీపట్నం సమీపంలో తీరం దాటినా మళ్లీ సముద్రంలోకి ప్రవేశించి ఉత్తర కోస్తా మీదుగా ప్రయాణించి విధ్వంసం సృష్టించింది. అలాగే 2018 డిసెంబర్ 17న పెథాయ్ తుఫాను మొదట యానాం వద్ద తీరం దాటినా మళ్లీ సముద్రంలోకి వెళ్లి దిశ మార్చుకుని తుని సమీపంలో తీరం దాటి.. తిరిగి అక్కడి నుంచి ఒడిశా వైపు మళ్లి క్రమంగా బలహీనపడింది. ఫలితంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు అపార నష్టం వాటిల్లింది.
1891 నుంచి ఇప్పటివరకు డిసెంబరులో ఏర్పడిన ఏ ఒక్క తుఫాను కూడా ఒడిశాలో తీరం దాటలేదు. ఈ నెలలో ఏర్పడిన వాటిలో 8 తుఫాన్లు ఆంధ్ర కోస్తాకు సమీపంలోకి వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు మళ్లిపోయాయి. మరి ప్రస్తుత జవాద్ తుఫాను ఇక్కడే తీరం దాటుతుందో.. చివరి నిమిషంలో దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళుతుందో చూడాలి.
Also Read : Cyclone, North Andhra – ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు