మనదేశంలో చాలా ఉచిత పథకాలున్నాయి. వాటిలో చావు కూడా ఒకటి. మనం రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురు చూస్తుంటే బాధ్యత లేకుండా ఒకడు వందకిలోమీటర్ల స్పీడుతో నడిపి కారును మనమీద పడేయొచ్చు. వర్షం వస్తే మ్యాన్‌హోల్ గుంతలో పడి మనం చచ్చిపోవచ్చు. రోడ్డు మీద వేలాడుతున్న తీగల్లో ఒకదాంట్లో విద్యుత్ ప్రవహించి , మనకు తగిలినా పోతాం. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు చూస్తూ ఒకడు రాంగ్ సిగ్నల్ ఇస్తే రైళ్లు ఢీకొని మన బతుకు ముగిసిపోవచ్చు.
మెట్రో ఫిల్లర్ కింద నిలబడితే పెచ్చులూడి చచ్చిపోవచ్చు. గోదావరిలో షికారుకెళితే నిర్వాహకుల అత్యాశ వల్ల మునిగిపోవచ్చు. హోర్డింగ్ మీద పడి చనిపోవచ్చు. అనవసరంగా జీవితంపై ఆశలు పెంచుకుంటాం గానీ వేదాంతులు చెప్పినట్టు జీవితం గాలి బుడగ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. విషాదం ఏంటంటే మనం మన నిర్లక్ష్యం వల్ల చనిపోయినా అర్థం ఉంది. ఎదుటి వాడి నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం, అహంకారం వల్ల ఎందరో చచ్చిపోతున్నారు.
మొన్న గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ప్రమాదం చేసిన వ్యక్తికి ఓవర్ స్పీడ్ కింద వెయ్యి రూపాయల జరిమానా విధించారట, కేసులు పెట్టారట. ఆయనకు డబ్బుంది. పైగా ఇంటిపేరు కల్వకుంట్ల. లాయర్లను పెట్టుకుంటాడు. పై కోర్టులకి వెళుతాడు. ఎలాగో బయటకొచ్చి భార్యాపిల్లలతో హాయిగా బతికేస్తాడు.
తల్లిని పోగొట్టుకున్న పిల్లలు జీవితాంతం ఏడుస్తారు. తల్లి శవాన్ని భయంకరంగా చూసిన ఆ కూతురు బతికినంత కాలం నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉంటుంది. పక్కటెముకలు విరిగిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు చికిత్స కోసం అయ్యినవాళ్లందరిని డబ్బు అడుగుతారు. అప్పులు చేస్తారు.
ఆస్పత్రి నుంచి బయటకొచ్చిన ఆ అమ్మాయికి తానెందుకు మునుపటిలాగా నడవలేకపోతుందో అర్థమై , కారణం ఎవరో తెలిసి కూడా నిస్సహాయంగా ఏడుస్తూ జీవిస్తుంది.
మెట్రో ఫిల్లర్ పెచ్చులూడి చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు తమ బిడ్డ ఫొటోలు చూసి ఏడుస్తూ ఉంటారు. మెట్రో అధికారులు విచారణ జరిపించి ఒక నివేదికను సమర్పిస్తారు. అది డస్ట్బీన్లోకి వెళుతుంది.
మనదేశంలో నాయకుల ప్రాణాలకే తప్ప ప్రజల ప్రాణాలకు విలువ లేదు. సామాన్యులు బతికి ఉండాలని నాయకులు ఎందుకు కోరుకుంటారంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలి కాబట్టి!