పాలపర్తి డేవిడ్రాజు .. ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ, టీడీపీ అంటూ తెగ పార్టీలు మార్చారు. రెండు మూడు సార్లు ఇటు, అటూ చక్కర్లు కొట్టారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జి పదవి ఆశించి టీడీపీలోకి చేరిన ఆయనకు ఆ పార్టీ హ్యాండిచ్చింది. దీంతో పార్టీ నిర్ణయాలు మింగుడుపడక, వైసీపీ లోకి వెళ్లే దారి లేక అల్లాడుతున్నారట. తన బాధనంతా అనుచరుల వద్ద వెళ్లగక్కుతూ రాజకీయ భవిష్యత్ ఎలా అని తీవ్ర తర్జనభర్జన పడుతున్నారట. ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతోంది.
సీనియర్ రాజకీయ నాయకుడైన డేవిడ్ రాజు తెలుగుదేశం పార్టీ తరఫున జడ్పీ ఛైర్మన్ గా చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. 2014లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ ఆదరణతో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయినప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది తిరక్కుండానే గెలిపించిన పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పుడు అధికారంలో టీడీపీ గూటికి చేరిపోయారు.
మూడున్నరేళ్లు ఎమ్మెల్యే గా తన హవా నడిచింది. ఆయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ డేవిడ్రాజుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ అనుకున్నది దక్కలేదు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా, వేచి చూడకుండా మళ్లీ టీడీపీ కండువా కప్పేసుకున్నారు.
టీడీపీ నుంచి వైసీపీకి.. మళ్లీ వైసీపీ నుంచి టీడీపీ చేరిన డేవిడ్ రాజు .. ఎర్రగొండపాలెం ఇన్ చార్జి కోసం తెగ ప్రయత్నాలు చేశారు. ఈసారి ఆ పార్టీ కూడా నిలకడలేని డేవిడ్ రాజకీయాలను నమ్మలేదు. దీంతో ఆయనకు నిరాశే ఎదురైంది. జగన్ దెబ్బతో వ్యూహాలు మార్చుకుంటున్న బాబు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీలో యవ రక్తాన్ని నింపాలని చూస్తున్నారు. అందు కోసం సీనియర్ నేతలనూ పక్కనపెట్టాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే యర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఎరిక్సన్ బాబును నియమించారు.
ఎరిక్సన్ బాబుది కనిగిరి నియోజకవర్గం. అయినప్పటికీ ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉండడంతో స్థానికంగా ఉన్న నేతలను కాదని తిరిగి పార్టీలోకి వచ్చిన డేవిడ్ రాజునూ కాదని ఎరిక్సన్ బాబుకు అవకాశం కల్పించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ఇప్పటికే వైసీపీ, టీడీపీల్లోకి రెండుమూడు సార్లు అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు జంపింగ్ చేసిన డేవిడ్రాజుకు తెలుగుదేశం నిర్ణయం మింగుడు పడటం లేదట.
ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గడ్డు కాలం నడుస్తోంది. మరో ఐదు, పదేళ్లు ఇదే పరిస్థితి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అయినప్పటికీ అధికార పార్టీని వదిలి వస్తే.. టీడీపీ ఇలా హ్యాండిచ్చింది ఏంట్రా అనుకుంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారట డేవిడ్రాజు. వైసీపీలో తిరిగి చేరే పరిస్థితి లేదని వాపోతున్నారట. ఎందుకంటే అక్కడ దారులు మూసుకుపోయాయని చెబుతున్నారు. ఈ క్రమంలో డేవిడ్ రాజు రాజకీయ భవిష్యత్ డైలమాలో పడింది. రానున్న ఎన్నికల నాటికి ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.