రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడడం లేదు. గత నెలలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కాస్తా వాయుగుండంగా మారి రాయలసీమ జిల్లాలను ముంచెత్తిన విషయం తెలిసిందే. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ విషాదం నుంచి కోలుకుంటున్న సమయంలో రాష్ట్రానికి తుఫాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటి వర్షాలు రాయలసీమను దెబ్బతీయగా ఈసారి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల పై పెను ప్రభావం చూపనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంఏర్పాట నాటికి తుఫానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై పెను ప్రభావం చూపే అవకాశముంది.
డిసెంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోపాటు.. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దక్షిణ థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది.
శుక్రవారం (డిసెంబర్ 3) బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. తర్వాత ఇది వాయువ్య దిశగా ప్రయాణించి.. మరింత బలపడుతూ నాలుగో తేదీ నాటికి ఉత్తరాంధ్ర – ఒడిశా తీరాలను చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : OTS – వన్‌టైం సెటిల్మెంట్ స్కీం మీద కుట్ర.. అడ్డంగా దొరకడంతో సస్పెన్షన్…!