ఫిబ్రవరి 28,1928న లండన్ నుంచి భారతదేశానికి నౌకలో తిరిగి వస్తున్న నలభై సంవత్సరాల చంద్రశేఖర వెంకట రామన్ తన ముందు గాజు గ్లాసులో ఉన్న గ్లిజరిన్ వైపు చూస్తూ యురేకా అని అరవాల్సిన క్షణాలు అవి. గత కొన్ని రోజులుగా ఆయన్ని పీడిస్తున్న సమస్యకి ఆ గ్లాసులో సమాధానం లభించింది. అదే ఆ తరువాత ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబుల్ బహుమతి తెచ్చి పెట్టడమే కాకుండా ఆ తేదీని జాతీయ విఙాన దినంగా జరుపుకొనేలా చేసింది.
బాల్యం నుంచే మేధావి
నవంబరు 7,1888న తమిళనాడు లోని తిరుచిరాపల్లిలో జన్మించిన సి. వి. రామన్ చిన్నప్పటి నుంచే సైన్సులో విశేషమైన ప్రఙాపాటవాలు చూపించాడు. తండ్రి గణిత శాస్త్రంలో లెక్చరర్ కావడంతో ఇంటినిండా పుస్తకాలు ఉండేవి. దాంతో పదహారేళ్ళ వయసులోనే మద్రాసు యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి, ఆ తరువాత రెండేళ్లకే ఎంఏ డిగ్రీ కూడా సాధించాడు. పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే కలకత్తాలోని ఇండియన్ ఫైనాన్స్ సర్వీసులో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ ఉద్యోగంలో చేరి, తన ఖాళీ సమయంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థలో తనకు ఇష్టమైన ధ్వనిశాస్త్రంలో స్వతంత్రంగా పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు.
1917 వరకూ రెండు పడవల మీద ప్రయాణం చేసిన రామన్ ఆ సంవత్సరం తన ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ, భౌతిక శాస్త్రంలో హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా చేరి తన సమయమంతా తన కెంతో ఇష్టమైన ధ్వనిశాస్త్రంలో పరిశోధనలకు కేటాయించారు.
రామన్ ఎఫెక్ట్
1921లో ఇంగ్లాండులోని ఆక్స్ ఫోర్డ్ లో జరిగిన బ్రిటిష్ సామ్రాజ్య విశ్వవిద్యాలయాల కాంగ్రెసులో పాల్గొనే అవకాశం రామన్ కు వచ్చింది. అప్పుడే భౌతికశాస్త్రంలో గొప్ప పేరున్న ధామ్సన్, రూథర్ ఫోర్డ్ లాంటి శాస్త్రవేత్తలను కలుసుకోవడమే కాక, లండన్ లోని సెయింట్ పాల్స్ కేథడ్రల్ చర్చిలో శబ్దం గురించి కొన్ని ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది.
తిరుగు ప్రయాణంలో ఓడలో నుంచి మధ్యధరా సముద్రాన్ని చూస్తున్న రామన్ మదిలో సముద్రంలోని నీటికి నీలం రంగు ఎలా వచ్చిందో అన్న ప్రశ్న మొదలైంది. ఆకాశంలోని నీలి వర్ణం సముద్రంలో ప్రతాఫలించడం వల్ల సముద్రానికి ఆ రంగు వచ్చిందని ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త లార్డ్ ర్యాలీ సిద్దాంతం సరయినదని రామన్ భావించకుండా తన ప్రయాణంలో ఓడలో అందుబాటులో ఉన్న వివిధ రకాల ద్రవాలను ఒక గాజు గ్లాసులో నింపి దానిలోకి టార్చ్ లైట్ వేసి పరిశోధనలు చేయసాగాడు.
ఫిబ్రవరి 28,1928న ఒక గ్లాసులో గ్లిసరిన్ నింపి, దానిలోకి లైట్ వేస్తే అది ఆకుపచ్చ రంగులోకి మారడం చూసిన రామన్ కు తనను వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. కాంతి తరంగాలను నీటి అణువులు వివిధ దిశల్లో పరావర్తనం చెందించడమే అందుకు కారణం అని సిద్ధాంతీకరించి తన సిద్ధాంతాన్ని పేపర్ రూపంలో నేచుర్ జర్నల్ కి, లేఖ రూపంలో లార్డ్ ర్యాలీకి తన నౌక బొంబాయిలో ఆగినప్పుడు పోస్టు ద్వారా పంపాడు రామన్. దీనినే తర్వాత రోజుల్లో రామన్ ఎఫెక్ట్ అన్నారు.
ఈ ఆవిష్కరణకు కానూ 1930లో రామన్ భౌతికశాస్త్రంలో నోబుల్ బహుమతి గెలుచుకున్నారు. రవీంద్రనాధ్ ఠాగూర్ తర్వాత నోబుల్ బహుమతి గెలుచుకున్న రెండవ భారతీయుడు సి. వి. రామన్. స్వాతంత్య్రం తర్వాత 1954లో భారత ప్రభుత్వం రామన్ ని అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించింది.
రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
1933లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థకి మొదటి భారతీయ డైరెక్టరుగా నియమితుడైన రామన్ 1948లో పదవీ విరమణ చేసేవరకూ ఆ హోదాలో పని చేశారు. అప్పటికే రామన్ తన స్వంత నిధులకు తోడుగా మరికొన్ని విరాళాలు సేకరించి బెంగళూరు శివార్లలో పదకొండు ఎకరాలలో నిర్మించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో ఎటువంటి బాదరబందీలు లేకుండా తన శేషజీవితం నవంబర్ 21,1970న మరణించేవరకూ పూర్తిగా రీసెర్చ్ కే అంకితం చేశారు. తర్వాత రోజుల్లో ఇక్కడే ఆయన రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పారు.
నేషనల్ సైన్స్ డే
1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (NCSTC) అనే భారత ప్రభుత్వ సంస్థ సి. వి. రామన్ తన రామన్ ఎఫెక్టును కనుగొన్న ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరపాలని ప్రతిపాదించి, ఆ మరుసటి సంవత్సరం నుంచి నేషనల్ సైన్స్ డే జరపడం మొదలు పెట్టింది. ఒక్కో సంవత్సరం ఒక్కో అంశాన్ని థీమ్ గా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం నేషనల్ సైన్స్ డే థీమ్
Future of Scene Technology and Innovation Impacts on Education, Skills, and Work”
ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి, మరింత మంది సైంటిస్టులను తయారు చేయడం నేషనల్ సైన్స్ డే లక్ష్యం.