అమరావతి పేరుతో ఏపీలో జరుగుతున్న ఆందోళనలో సంబంధం లేని సంస్థల పేరును, వ్యక్తులను వాడుకుంటుండం వివాదాస్పదంగా మారుతోంది. తమను రాజకీయంగా వాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా అమరావతి పేరుతో జరుగుతున్న రాజకీయ పోరును పరిరక్షణ ఉద్యమాన్ని క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)పై రుద్దడం పట్ల ఆ సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ సంస్థ పేరును ఉపయోగించుకుని ఉద్యమాన్ని నడిపిస్తుండడంపై క్రెడాయ్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి ఆదర్యంలో వివిధ సంఘాలు సమావేశమైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది.
చంద్రబాబు కనసన్నల్లో…
ప్రతిపక్ష నేత చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి, దాని జేఏసీకి నేతృత్వం వహిస్తున్న బిల్డర్లు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, ఆర్వీఎన్ స్వామి తదితరులు క్రెడాయ్ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఇది తగదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఇటీవల జరిగిన అసోసియేషన్ సమావేశంలోనూ అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో క్రెడాయ్ అసలు లక్ష్యం, దాని ప్రాధాన్యతను కొందరు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో క్రెడాయ్ పేరుతో రాజధాని ఉద్యమం చేసే వారికి అడ్డుకట్ట వేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. త్వరలోనే క్రెడాయ్కి, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా చెప్పనుంది. రాజధాని ఉద్యమంతో క్రెడాయ్కి ఎటువంటి సంబంధం లేదు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకుని పరిష్కరించుకోవడానికే క్రెడాయ్ ఏర్పాటైంది. క్రెడాయ్కి రాజకీయాలతో ఏ సంబంధం లేదు. కొందరు వ్యక్తిగతంగా ఉద్యమంలో పాల్గొని క్రెడాయ్ పేరును వాడుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని చెబుతున్నారు.