ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటకాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అందులో ఒక పాత్ర ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సుబ్బిశెట్టి అనే పాత్ర వినోదం కోసమే ముందుగా ఆ పాత్రను ప్రవేశపెట్టినా అది వినోద స్థాయి దాటి వెకిలితనానికి దారి తీసింది. దీంతో ఆ సామాజిక వర్గం వారు అనేక సార్లు ఈ విషయం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. అయితే ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం దాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక ఈ అంశం మీద ఆర్యవైశ్యుల నుంచి హర్షం వ్యక్తం అవుతూ ఉండగా అన్ని విషయాల్లో జగన్, జగన్ సర్కార్ ను ఎలా కార్నర్ చేయాలా అని చూసేవారు మాత్రం ఆ పనిలోనే ఉన్నారు. ఇక తాజాగా ఈ నిషేధం మీద సీపీఐ నారాయణ తనదైన శైలిలో స్పందించారు. అయితే చింతామణి నాటకాన్ని నిషేధించటాన్ని కళామతల్లి మీద దాడిగా ఆయన అభివర్ణిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. అక్కడితో ఆగకుండా మీకు చేతనైతే.. బ్రోతల్ హౌస్ లాంటి బిగ్‌బాస్‌ను నిషేధించాలని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఆ షో మీద ఆక్రోశం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా బిగ్‌బాస్ బ్రోతల్ షో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాగ్ కార్యక్రమం ఓ క్యాన్సర్ లాంటిందని అభిప్రాయపడ్డారు.
నైతిక విలువలు దెబ్బతినేలా పిల్లల బుర్రలు పాడయ్యేలా ఈ ప్రోగ్రాం ఉందని చెప్పుకొచ్చారు. నేరాలు పెరగడానికి ఇలాంటి షో లే కారణమవుతున్నాయని, బయటకే ఇన్ని బూతులు కన్పిస్తుంటే కన్పించకుండా ఇంకేం జరుగుతుందోనని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్లు కారణంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. షోకి వెళ్లిన కొందరు కంటెస్టెంట్లు తమ వ్యక్తిత్వాల గురించి అలా మాట్లాడిన నారాయణ మీద విమర్శలు గుప్పించారు. అయితేనేమి ఇప్పుడు కూడా ఆయన విరుచుకుపడడం గమనార్హం.
Also Read : సుబ్బిశెట్టి పాత్ర – ఆర్యవైశ్యులకి అవమానమే