రాష్ట్రమంతా అభివృద్ధి జరగాలని ఆ పార్టీ ముందునుంచీ కోరుకుంటోంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం బాగుపడాలని ఆయన ఎప్పుడూ ఉద్యమాలు చేస్తూ ఉంటాడు. అయితే సడన్‌గా ఇప్పుడు తడబడినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ ఏంటి. ఎవరా నాయకుడు. అసలేం జరుగుతోంది ఆ పార్టీలో..
రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఉద్యమించే ఆ పార్టీ ఏదైనా ఉందంటే టక్కున సీపీఐ, సీపీఎం పేర్లు చెబుతారు ఎవరైనా. ఎందుకంటే ఎప్పుడూ ఉద్యమాలు చేస్తూ అభివృద్ధి కావాలని కోరుకుంటారు కాబట్టి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రతి జిల్లా అబివృద్ధి చెందాలని కృషి చేస్తోంది.
ఆ విధంగా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే అబివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటుచేయబోతున్నారు. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతాల ప్రజలంతా సంతోషపడుతున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా పైన మనం చెప్పుకున్న విధంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలని కోరుకున్న సీపీఐ పార్టీ ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తోంది. అంటే ఇక్కడ పార్టీ వ్యతిరేకించడం కాదు కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుతో కలిసి రోజూ ఉద్యమాల్లో పాల్గొంటున్నాడు. అసలు రామకృష్ణ సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ అభివృద్ధి వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో అర్థంకాక ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేసిన వ్యక్తి ఇప్పుడు అభివృద్ధి జరుపుతామంటున్నా మళ్లీ నిరసనల్లో పాల్గొంటుండటం వెనుకున్న రహస్యమేంటో అర్థంకావడం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో ఈయన సాన్నిహిత్యం ఏంటో ఎవ్వరికి అంతుపట్టడం లేదు. దీనిపై ఆ పార్టీ నేతలు బహిరంగంగానే మండిపడుతున్నారు.
తాజాగా కర్నూలు జిల్లాలో సమావేశం నిర్వహించిన నేతలు రామకృష్ణ వైఖరిపై తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.వి సత్యనారాయణ తో పాటు జిల్లా కార్యవర్గం నుంచి జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి రసూల్‌తో పాటు ఇతర నేతలు సమావేశం అయ్యారు. చంద్రబాబుతో కలసి మన పార్టీ నేత ఉద్యమాలు చేయడం కొత్తకాకపోయినా.. ఒక స్పష్టమైన వైఖరి లేకుండా ఇలా మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం మంచిది కాదని నేతలు సమావేశంలో చర్చించారు. రాయలసీమలో హైకోర్టు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చిన తర్వాత ప్రజలంతా సంతోషిస్తుంటే మనమెందుకు వ్యతిరేకించాలని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఒక క్లారిటీ లేకపోతే మన పార్టీ సిద్దాంతాలు దెబ్బతీసేందుకు దగ్గరుండి ప్రోత్సహించినట్లు అవుతుందని ఆవేధన వ్యక్తం చేశారు.
రాయలసీమలో రాజధాని పెడతామని చెబుతున్నా మూడు రాజధానుల ప్రకటనను రామకృష్ణ వ్యతిరేకించి ఎందుకు చంద్రబాబు చెంతన చేరాడన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.. ఒకప్పుడు వామపక్షాలతో కలిసి పనిచేసిన చంద్రబాబు ఆ తర్వాత వారికి దూరంగా ఉన్నాడు. సీపీఐ రామకృష్ణ కూడా చంద్రబాబు విధానాలను వ్యతిరేకించిన సందర్బాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ లేనంతగా చంద్రబాబుతో రామకృష్ణ పనిచేయడమే ఇప్పుడే మొదటిసారి. తన పార్టీ సిద్ధాంతాలను బట్టి చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆయన చెప్పిన సందర్బాలు చాలానే ఉన్నాయి. రాయలసీమకు సాగునీటి విషయంలో రామకృష్ణ ఎన్నో పోరాటాలు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం సాగునీటి విషయంలో ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవెల్లి కి చెందిన రామకృష్ణ కర్నూలు జిల్లాలోనే వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 1994లో అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా రామకృష్ణ గెలిచారు. ఆ తర్వాత 1999లో అనంతపురం నుంచి ఓడిపోయారు 2009 ఎన్నికల్లో టీడీపీ పొత్తూతో ఆలూరు నుంచి కూడా పోటీ చేసినా గెలవకలేకపోయారు. రామకృష్ణ విషయంలో కొంత లోతుగా ఆలోచిస్తే పార్టీ విధానాలు, సిద్దాంతాలను పక్కనపెట్టి రామకృష్ణ తన సొంత భవిష్యత్తు కోసం పాకులాడుతున్నాడా అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇన్నేళ్ల రాజకీయ జీవితం అనంతరం తన వారసులను కూడ రాజకీయంగా పునాదులు వేయాలన్న ఆలోచనలో ఉన్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గతంలో ఆయన కుమారుడికి ఆలూరు నుంచి కానీ, గుంతకల్లు నుంచి కానీ సీటు ఇప్పించుకునేందుకు చంద్రబాబుతో సంప్రదింపులు జరిపినట్లు చర్చించుకుంటున్నారు. కేవలం స్వప్రయోజనాల కోసమే ఇలా చంద్రబాబుతో రాసుకొనిపూసుకొని తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేకపోతే సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పకుండా తెలుగుదేశం నేతలాగా ఆయన పరుగెడుతున్న తీరు పార్టీ నేతలను ముక్కునవేలేసుకునేలా చేస్తోంది.
రాష్ట్రంలో మూడు రాజధాలను ప్రకటన వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, రామకృష్ణ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా పోరాటాలు చేసేందుకు వస్తున్నారు. ఓ సమయంలో రామకృష్ణ సీపీఐని వీడి టిడిపిలో చేరారా అన్నట్లుగా రాష్ట్రంలో జనాలు, సీపీఐ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రామకృష్ణ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సీపీఐ గురించి ఎవరు మాట్లాడినా అభివృద్ధి కోసం ప్రాకులాడే పార్టీగానే చెబుతారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి చేస్తామన్న వైసీపీకి మద్దతు ఇవ్వాలి.. లేదంటే మరింత అభివృద్ధి కావాలని పోరాటం చేయలి. ఇవేమీ చేయకుండా వికేంద్రీకరణ వద్దు అంటున్న పార్టీతో అంటిపెట్టుకోవడం సరైంది కాదు.