ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవి డ్ -19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణగా తూర్పు గోదావరి జిల్లా ను తీసుకోవచ్చు. ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించి ప్రజలకు వైరస్ భయాన్ని దూరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో 19 వ తేదీ నాటికి 78,870 మంది నుంచి కోవిడ్ శాంపిల్స్ ను సేకరించారు. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఇన్ని పరీక్షలు నిర్వహించి ఉండరు. వాటిలో 72,278 మందికి కరోనా టెస్టులు పూర్తయ్యాయి. వారిలో నేటి వరకూ 653 మంది పాజిటీవ్ వచ్చింది. అంటే.. వచ్చిన ఫలితాలను చూస్తే.. వైరస్ వచ్చిన వారి శాతం.. ఒకటి కన్నా తక్కువే..
పాజిటివ్ వచ్చిన వారిలో కూడా.. 351 మంది మాత్రమే.. జిల్లాకు చెందినవారున్నారు.302 మంది ఇతర ప్రాంతాలు వారున్నారు. మొత్తం 132 కంటోన్మెంట్ క్లస్టర్లు ఉండగా 90 యాక్టివ్ లో ఉన్నాయి. రికవరీ శాతం కూడా ఎక్కువగానే ఉండడం శుభ పరిణామం. చికిత్స అనంతరం 301 మంది డిశ్చార్జ్ అయ్యారు. 346 మంది పాజిటీవ్ బాధితులు కోవిడ్ ఆస్పత్రులు, హోమ్ ఇసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు మృతి చెందారు.103 మంది హోమ్ ఇసోలేషన్లో ఉన్నారు.
ఆ గ్రామంలో లాక్ డౌన్
పరిస్థితి సీరియస్ గా ఉన్న చోట కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజా ఆలమూరు మండల పరిధి పెనికేరు గ్రామంలో అధికారులు లాక్ డౌన్ విధించారు. ప్రజలు అందరూ హోమ్ క్వారమ్ టైన్ ఉండాలని ఆదేశించారు. గ్రామంలో (కోవిడ్-19) కరోనా వైరస్ కేసులు విజృంభిస్తుండడంతో ఆ గ్రామం పూర్తిగా లాక్డౌన్ లో ఉంచామని అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి ఇతర గ్రామాల వారు ఎవరూ రావద్దని అలాగే గ్రామం నుండి ఎవరూ బయటికి వెళ్లవద్దని వారు హెచ్చరించారు. అలాగే గ్రామంలో అందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు. అలాగే గ్రామ ప్రజలకు కావలసిన మంచినీరు నిత్యావసర వస్తువులు చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఎంపిడిఒ జెఎ జాన్సీ, తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే మంచినీరు 24 గంటలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎఇ పోశమ్మ తెలిపారు. ముఖ్యంగా ప్రజలు ఎవ్వరూ అధికారుల అనుమతి లేకుండా విచ్చలవిడిగా సంచరిస్తే కఠినచర్యలు తప్పవని మండపేట రూరల్ సిఐ కె మంగాదేవి, ఎస్సై శుభాకర్లు హెచ్చరించారు.
వినూత్నమైన చర్యలు..
కరోనా కట్టడిలో భాగంగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి కలెక్టర్ మురళీధర్ రెడ్డి వినూత్నమైన శిక్షలు తీసుకొచ్చారు. మాస్క్ లేకుండా బయట తిరిగే వ్యక్తులు పట్టుబడితే, గంటపాటు ఆ వ్యక్తి కరోనా బొమ్మలు, ఫ్లకార్డులు పట్టుకుని ప్రదర్శించాలి. షాపులలో వర్తకులు, సేల్స్ మెన్ లు మాస్క్ లు ధరించకపోయిన, మాస్క్ ధరించని వినియోగదారున్ని షాపులోకి అనుమతించినా, వారం పాటు ఆ షాప్స్ సీజ్. ఇక నుండి షాపులు, ముఖ్య కూడళ్ళు వద్ద అధికారుల ఆకస్మిక తనిఖీలు. కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.
ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ఏపీ మొత్తం 491 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,452 కు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.85 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.