కొన్ని సినిమాలు అంతే. టాక్ బాగుంటుంది. కానీ థియేటర్లలో జనం ఉండరు. రివ్యూస్ బాగా వస్తాయి. తీరా టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లు ఉండవు. ఫైనల్ గా చూస్తే వసూళ్ల లెక్కలో ఇవి డిజాస్టర్లుగా మిగిలిపోతాయి. ఏ టీవీలోనో లేదా ఓటిటిలోనో తాపీగా చూసినప్పుడు అరె పర్లేదు మనం విన్నంత బ్యాడ్ గా ఏమీ లేదే అని ప్రేక్షకుడు నిట్టూరుస్తాడు. దానికి ఉదాహరణగా ఇటీవలి కాలంలో రెండు సినిమాల గురించి చెప్పుకొచ్చు. ఒకటి శ్రీకారం. రెండు వైల్డ్ డాగ్. పేరున్న స్టార్లు, బడ్జెట్ లెక్క చేయని సంస్థలు, మంచి నెట్ వర్క్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ల అండ, అన్నింటిని మించి అభిమానుల సపోర్ట్. కానీ ఇవేవి పైన చెప్పిన మూవీస్ కి పని చేయలేదు. ఎందుకో చూద్దాం.
దర్శకుడి ఉద్దేశం ఎంత మంచిదైనా, కథలో విషయం ఎంత లోతుగా ఉన్నా అది సామాన్యుడిని రంజింపజేసేలా ఉండాలి. అంతే తప్ప మేము కమర్షియల్ ఫార్ములాకు దూరంగా తీశాం కాబట్టి ఆ కోణంలోనే చూడండని కండిషన్లు పెడితే వర్క్ అవుట్ కాదు. శ్రీకారం అయినా వైల్డ్ డాగ్ అయినా వీటిలో జరిగిన పొరపాటు ఇదే. మరీ దారుణంగా ఉన్నాయని ఎవరూ అనలేదు. కానీ బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేక ఇబ్బంది పడ్డాయి. శ్రీకారం సగం నష్టాలతో డిజాస్టర్ కాగా వైల్డ్ డాగ్ ఇప్పటిదాకా కష్టం మీద మూడు కోట్లు రాబట్టింది. లాస్ రాకూడదు అంటే ఇంకో నాలుగైదు కోట్లు రాబట్టాలి. కానీ వకీల్ సాబ్ వచ్చేలోపు అంత తేవడం అసాధ్యం
ప్రేక్షకుల్లో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఒక పరిమితి విధించుకుని కేవలం వీళ్ళను మాత్రమే మెప్పించాలని ఏ హీరో అనుకోడు. అందులోనూ నాగార్జున లాంటి సీనియర్ స్టార్, శర్వానంద్ లాంటి మార్కెట్ ఉన్న హీరో అసలు చేయరు. ఉన్నంతలో మంచి కాన్సెప్ట్స్ తో క్లాసు మాసుని మెప్పించే ప్రయత్నం చేశారు కానీ దర్శకుల తడబాటు వల్ల ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండూ డెబ్యూ దర్శకులవే కావడం గమనించాల్సిన అంశం. చిన్నితెరపై ఎందరు మెచ్చుకున్నారు అనేది ఎప్పటికీ కొలమానం కాదు. థియేటర్లలో ఎంత ఆడిందనే దాన్ని బట్టే ఏ సినిమాకైనా హిట్టా ఫ్లాపా అనేది డిసైడ్ అవుతుంది.