లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సామాన్యులకు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు కూడా కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే దేశంలో పలువురు ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో కరోనా వైరస్ సోకిన తొలి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ట్విట్టర్ వేదికగా ఆయనే వెల్లడించారు. వైద్యులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి ఉన్నారు. “నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం రావడంతో పరీక్షలు చేసుకున్నా. ఆ పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో వివిధ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొన్న వారందరూ కోవిడ్ పరీక్షలు చేసుకోండి. ఇదే నా విన్నపం. వారందరూ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోండి’’ అని ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు.
కాగా దేశంలో కరోనా సోకిన తొలి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నిలిచారు. తదనంతర సమీక్షా సమావేశాలను వీడియో కాన్ఫెరెన్సు ద్వారా కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.