దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 34 లక్షలకు చేరువవుతోంది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనకు అనుగుణంగా కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలోనూ పార్లమెంట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు అందరూ విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. సమావేశాలు ప్రారంభం కానున్న కారణంగా సభ్యులందరూ విధిగా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందే అన్నారు. ఎంపీలతో పాటు పార్లమెంట్ సిబ్బంది, అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పీకర్ సూచించారు.
ప్రత్యేక ఏర్పాట్లు
వైరస్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా పార్లమెంట్ లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఓం బిర్లా తెలిపారు. దీంతో పాటు సభ్యులకు స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు 1952 తర్వాత కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో సమావేశాల నిర్వహణ జరుగుతోంది. ఎంపీల కోసం పెద్ద పెద్ద స్క్రీన్లు, కేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. చాంబర్లలో 85 అంగుళాల నాలుగు పెద్ద డిస్ ప్లే స్క్రీన్లు, నాలుగు గ్యాలరీలలో 40 అంగుళాల ఆరు చిన్న స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ 12 బిల్లులను ఆమోదించింది. ఆ సెషన్స్‌లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్థంతరంగా తెరపడింది.