సూరిబాబుకు వంట చేయడం వచ్చేసింది. కరోనా నేర్పించింది. మనోడు సాంబారు చేస్తే జూబ్లీహిల్స్ అంతా ఘుమఘుమ లాడుతోంది. అసలు వీడు హైదరాబాద్ వచ్చింది సినిమా డైరెక్టర్ అవుదామని. యాక్షన్ , కట్ చెప్పాల్సిన నోటితో “ఈ రోజు ఏం వండమంటారు?” అని అడుగుతున్నాడు.
సినిమాలు చూసిచూసి , సినిమా పత్రికలు చదివి చదివి ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. ఊళ్లో ఫ్రెండ్స్ అందరికీ డైరెక్టర్‌గా తిరిగి వస్తానని చెప్పాడు. పైకొచ్చిన డైరెక్టర్లంతా చేతిలో చిల్లిగవ్వ లేకుండా కృష్ణానగర్‌లో దిగిన వాళ్లే. కానీ మనోడు 3 వేలతో దిగాడు. యూసఫ్‌గూడాలో ఒక ఫ్రెండ్ రూంలో దిగాడు. రేకుల షెడ్డులో ఐదుగురు ఉన్నారు. వీడి ఫ్రెండ్ సినిమా ఫీల్డ్‌లో పనిచేస్తాడు. వాడే సూరిబాబుకి ఇన్స్ఫిరేషన్. ప్రొడక్షన్లో పనిచేస్తాడు. అంటే లంచ్ బ్రేక్‌లో భోజనం వడ్డిస్తాడు.
హైదరాబాద్ చూడగానే కలలే కలలు. మంచి డ్రెస్ ఉండాలని ఫ్రెండ్ చెబితే, అమీర్‌పేటలో వెయ్యి రూపాయలతో ప్యాంటు, షర్ట్ కొన్నాడు. ఆ రాత్రికి నాలుగు వందలు పెట్టి బీర్ పార్టీ చేసుకున్నారు.
మరుసటి రోజు ఫ్రెండ్‌తో కలిసి షూటింగ్‌కు వెళ్లాడు. కెమెరా, లైట్లు చూసి ఇది కదా జీవితం అనుకున్నాడు. అది చిన్న సినిమా. పేరు లేని హీరో, డైరెక్టరే అంత ఫోజ్గా ఉంటే, ఇక పేరున్న వాళ్లు ఎట్లుంటారో అనుకున్నాడు. లంచ్ టైంలో ఫ్రెండ్‌తో పాటు తాను వడ్డించాడు. కొంత మంది జూనియర్ అర్టిస్ట్లని తాను ఏ సినిమాలో చూశానో గుర్తు తెచ్చుకున్నాడు. పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత తాను కూడా ఇంటర్వ్యూలో ఒకప్పుడు భోజనాలు వడ్డించానని చెప్పుకుంటాడు.
కలలు అడ్డుపడి ఆ రాత్రి నిద్రరాలేదు. రెండు రోజులు గడిచాయి. బుక్షాప్నకు వెళ్లి డైరెక్టర్ కావడం ఎలా? స్క్రీన్ ప్లే మెళకువలు తెచ్చుకుని చదివాడు. సూరిబాబు వాటా కింద అద్దె వెయ్యి రూపాయలు అడిగాడు ఫ్రెండ్. ఇంటికి ఫోన్ చేసి రూ.2 వేలు అడిగాడు. చెడామడా తిట్టి తండ్రి పంపించాడు.
Also Read: కరోనా కథలు- శీనయ్య పెండ్లాం ముడుపు కట్టింది!
రోజులు గడుస్తున్నాయి. రెండు మూడు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎగాదిగా చూసి ఖాళీలు లేవు పొమ్మన్నారు. డబ్బులు అయిపోయాయి. స్నేహితుడికి భారమయ్యాడు. ఒక హీరో ఇంట్లో పని ఉందంటే చేరాడు. భోజనం పెట్టి ఆరు వేలు. ఆ హీరో తల బిరుసుతో ఉన్న అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడెవరూ ఫోన్ చేయరు, ఫోన్ ఎత్తరు. మందేస్తే ఎవడి మీద కోపం చూపించాలో తెలియదు. గ్లాస్లు లేట్‌గా తెచ్చినందుకు సూరిబాబు దవడ పేలిపోయింది. కళ్లలో నీళ్లొచ్చాయి. ఆ తర్వాత దెబ్బలు అలవాటు అయిపోయాయి. దెబ్బతిన్నవాడే గెలుస్తాడని నోట్ బుక్‌లో రాసుకున్నాడు. అయితే తరచూ దెబ్బలు తినడం కష్టమైపోయింది. జీతం తీసుకుని మానేశాడు.
స్క్రీన్ మీద కనిపించే హీరోలు వేరు, ఇళ్లలో ఉండే హీరోలు వేరని అర్థమైపోయింది. సినిమాలు లాభం లేదని టీవీలతో కెరీర్ స్టార్ట్ చేద్దామని ఒక సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. భోజనం పెట్టి ఖర్చులకి రోజుకి వంద రూపాయలు ఇస్తామన్నారు. పని నేర్చుకోవచ్చనుకున్నాడు.
ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది వరకు పని. వాళ్లు నేర్పించిందీ లేదు వీడు నేర్చుకున్నదీ లేదు. కుళాయిలో నీళ్లులాగా డైలాగ్‌ల ప్రవాహం. ఎన్ని రోజులు చూసినా కథ ఏంటో అర్థం కాలేదు. లాభం లేదని మానేశాడు. జీతం రోజుకి 200 ఇస్తామన్నారు. అయినా మానేశాడు.
కాస్త పేరున్న ప్రొడక్షన్ కంపెనీలో బాయ్‌గా చేరాడు. డైరెక్టర్, రైటర్స్ డిస్కషన్స్ చేస్తుంటే ఒక చెవితో వినేవాడు. ఫోన్లో సినిమాలు చూస్తూ ఆ సీన్ తానైతే ఎలా తీసేవాడో , డైలాగ్ ఏమి రాసేవాడో ఊహించుకునే వాడు. సినిమా స్టార్ట్ అయింది కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాన్స్ రాలేదు. షూటింగ్లో డైరెక్టర్‌కి సిగరెట్లు, లైటర్ అందించేవాడు. ఆయన దయతో ఒక వేషం ఇచ్చాడు. పాన్ డబ్బా కుర్రాడు. విలన్ వచ్చి అక్కడ సిగరెట్ ముట్టిస్తాడు. రోలింగ్ , టేక్, కట్ అనే పదాలు వినపడే సరికి, ఫ్రేమ్‌లో తాను ఉండేసరికి స్వర్గం కనపడింది. భవిష్యత్‌కి టైటిల్ కార్డు కనిపించింది.
ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పాడు. రిలీజ్ అయింది. ఆ సీన్ ఎడిటింగ్‌లో పోయింది. ఫ్రెండ్స్ ఫోన్ ఎత్తడం మానేశాడు. విరక్తితో ఇంకో ఆఫీస్‌లో చేరాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు బాయ్‌గా చేస్తే , స్టార్ట్ అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకుంటామని చెప్పారు.
ముహూర్తం రోజు ఉత్సాహంగా తిరిగాడు. వారం రోజుల్లో లాక్డౌన్ వచ్చింది. ఊళ్లకు వెళ్లలేక చిక్కుకుపోయిన ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లకు రోజూ వండిపెడుతున్నాడు. కూరలు చేయడం బాగా నేర్చేసుకున్నాడు.
కరోనా ఎప్పుడు పోతుందో తెలియదు. సూరిబాబు ఎప్పుడు డైరెక్టర్ అవుతాడో తెలియదు.