కనోనా వైరస్ కారణంగా మానవత్వం మంటగలసిపోయే సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అయితే నాణేనికి రెండు వైపులు ఉన్నట్లుగా ప్రతి అంశంలోనూ రెండో కోణం కూడా ఉంది. ఇందుకు కరోనాకు కూడా మినహాయింపేమీ లేదు. వైరస్ సోకని వారికి వైద్యం అందించేందుకు నిరాకరించేవారు ఉన్నట్లుగానే.. వైద్యం చేసేందుకు ముందుకు వచ్చే వారు ఉన్నారని నిరూపించారు కర్నూలు జిల్లా 108 సిబ్బంది. కరోనా వైరస్ సోకిన నిండు గర్భిణికి అకస్మాత్తుగా పురిటినోప్పులు రావడంతో 108లోనే కాన్పు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన సుబ్బయ్య, పెద లాలామ్మల దంపతులు. నిండు గర్భిణి అయిన పెద లాలామ్మ కాన్పు చేయాలని స్థానికంగా ఉన్న ప్రాథమిక వైద్యశాలకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లింది. అయితే ఆస్పత్రి సిబ్బంది ముందు కరోనాపరీక్ష చేయించుకోవాలని సూచించారు. పరీక్షలో అమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో స్థానిక వైద్యులు ఆమెను నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. 108ను పిలిపించారు.
నంద్యాలకు వెళుతున్న సమయంలో మార్గమధ్యలో పెద లాలమ్మకు పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. దీంతో 108 సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వాహనాన్ని రోడ్డుపక్కన నిపారు. వైరస్ సోకిన నిండుగర్భిణికి పురుడుపోసేందుకు సిద్ధం అయ్యారు. నూతనంగా వచ్చిన 108లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. పీపీఈ కిట్ ధరించిన 108 టెక్నిషియన్ నవీన్ పెద లాలమ్మకు పురుడుపోశారు. లాలమ్మ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కరోనా విపత్కర సయమంలో తనకు వైరస్ సోకినా లాలమ్మ మూడో కాన్పు 108 సిబ్బంది వల్ల ప్రశాంతంగా జరిగింది. కాన్పు తర్వాత తల్లీ, బిడ్డను 108 సిబ్బంది నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.