దేశంలో సెకండ్ వేవ్ రూపంలో కోవిడ్ కోరలు చాస్తోంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ముమ్మర వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగిస్తున్నాయి. జన సమూహాలు గుమిగూడే ఆస్కారమున్న అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నాయి. అయితే ఎన్నికలను మాత్రం వాయిదా వేసేందుకు ఇష్టపడటంలేదు. ఎన్నికలంటేనే ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు.. భారీగా జన సమీకరణలతో కూడుకున్న వ్యవహారం. ఇవే కోవిడ్ విశృంఖల విహారానికి దోహదం చేసే అంశాలు. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఆలస్యంగా కళ్ళు తెరిచాయి. దాంతో ఎన్నికలు జరిగిన, జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు గత నెల రోజుల్లోనే ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. ఈ విషయంలో అతి పెద్ద బాధితురాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. కోవిడ్19 ఇండియా.ఓఆర్జీ అనే సంస్థ అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య 16 రేట్లకు పైగా పెరిగింది.
సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియతో మరింత నష్టం
శాంతిభద్రతల సమస్య పేరుతో ఎన్నికల సంఘం బెంగాల్లో ఎనిమిది విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తోంది. మార్చి 27న తొలి విడత పోలింగుతో మొదలైన ఈ ప్రక్రియలో ఇప్పటికి ఐదు దశలు మాత్రమే పూర్తి అయ్యాయి. మరో మూడు విడతలు జరగాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో ప్రధాని మోదీ , రాహుల్, మమతా బెనర్జీ తదితర అగ్రనేతలందరూ రాష్ట్రాన్ని పలుమార్లు చుట్టేశారు. పోటాపోటీగా జనాలను పోగేసి భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలు నిర్వహించారు. ఆ జన సమూహాల్లోకి కరోనా వైరస్ చొరబడి.. వేల కేసుల నమోదుకు దోహదం చేసిందని అధ్యయన సంస్థ కోవిడ్19 ఇండియా.ఓఆర్జీ పేర్కొంది. ఆంక్షల్లేని ప్రచారాల ఫలితంగా కేసుల సంకెళ్లు తెగిపోయాయని వివరించింది. బెంగాల్లో మార్చి 20 నాటికి 3110 కేసులు ఉండేవి. ఏప్రిల్ 20 నాటికి వాటి సంఖ్య 53 వేలకు ఎగబాకింది. ఐదు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత గానీ నాయకులు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. కాంగ్రెస్ నేత రాహుల్, టీఎంసీ అధినేత్రి మమతా తమ ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కట్టు తప్పిన కేసులు వేల సంఖ్యలో కొత్తవారికి వ్యాపిస్తున్నాయి.
కేసుల పెరుగుదల ఇలా..
కోవిడ్19 ఇండియా.ఓఆర్జీ అధ్యయనం ప్రకారం ఎన్నికలు జరిగిన కొన్ని జిల్లాల్లో మార్చి 20-ఏప్రిల్ 20 మధ్య కేసులు పెరిగిన తీరు ఆందోళన కలిగిస్తోంది. పురులియా జిల్లాలో కేసులు 32 నుంచి 1440కి పెరిగాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో 158 నుంచి 3518కి, హుగ్లీ జిల్లాలో 97 నుంచి 2446కు, హౌడా జిల్లాలో 218 నుంచి 3390కి, ఉత్తర 24 పరగణాలు జిల్లాలో మరీ దారుణంగా 897 నుంచి 12407కు కేసులు పెరిగిపోయాయి.
పోలింగ్ కుదింపునకు నో
పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్న నేపథ్యంలో తన ప్రచారాలను రద్దు చేసుకున్న సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మిగిలిన మూడు దశల్లో పోలింగు జరగాల్సిన నియోజకవర్గాలన్నింటికీ ఒకే దఫా పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే బీజేపీ తదితర పార్టీలు దాన్ని వ్యతిరేకించడంతో ఈసీ కూడా మమత విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దాంతో మిగిలిన మూడు దశల పోలింగ్, ప్రచారం జరగడం తథ్యం. ఇవి పూర్తి అయ్యేలోపు బెంగాల్లో కోవిడ్ కేసులు ఏ స్థాయికి చేరుకుంటాయో ఆ దేవుడికే తెలియాలి.