ఒక్కరోజులో 22,500పాజిటివ్ కేసులు – 473 మరణాలు
దేశంలో కరోనా ఉద్ధృతి వేగంగా పెరుగుతోంది.గత ఐదు రోజుల నుండి 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.సోమవారం రికార్డు స్థాయిలో సుమారు 22,500 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 23,932 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,20,346 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 20174 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 473 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రష్యాని అధిగమించి మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 4,40,150మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 2,59,926 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసుల నమోదు
మహారాష్ట్రలో గడిచిన 24 గంటలలో కొత్తగా 5,368 మంది కరోనా బారిన పడటంతో మొత్తం కేసుల సంఖ్య 2,11,987కు చేరింది.అలాగే నిన్న ఒక్కరోజే 204 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకోవడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 9026 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో 87,682 వైరస్ యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 1,15,262 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఆర్థిక రాజధాని ముంబైలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాపిస్తుండటం ఆందోళన పరుస్తుంది. ముంబయిలో ప్రస్తుతం 84,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,899 మంది మృతి చెందారు.
దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం తమిళనాడు.కరోనా కేసుల సంఖ్యలో రెండోస్థానంలో ఉన్న తమిళనాడులో ఆదివారం 3,827 మందికి కరోనా సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,978 కి చేరింది.నిన్న 61 మంది మృత్యువాత పడటంతో మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 1,571 కి పెరిగింది.
తెలంగాణాలో 26 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,831 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 25,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10646 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 14,781 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 306 మంది మృత్యువాత పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 1322 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 20,019 మందికి కరోనా సోకగా 239 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో నమోదయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. 8,920 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 11,739,171 మందికి కోవిడ్ 19 సోకగా 540,660 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 6,642,366 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 3,040,833 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 132,979 మంది మరణించారు.