జాతీయ గీతం మరోమారు చర్చనీయాంశంగా మారింది. వందేళ్లకు పూర్వం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఈ గీతం ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగానే ఉంటోంది. అయినా దేశవాసులంతా దశాబ్దాలుగా ఈ గీతాన్ని ఆలపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ గీతంలో మార్పులు అవసరమనే ప్రతిపాధనను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ముందుకు తెచ్చారు. జాతీయ గీతంలో అనవసరపు పదాలు ఉన్నాయని, అందుకే ఆ గీతాన్ని మార్చాల్సిన అవసరముందని సుబ్రమణ్యస్వామి ప్రధానిని కోరారు. జనగణమన గీతం ఎవరినో కీర్తిస్తూ రాశారనే అనుమానాన్ని వ్యక్తం చేసిన ఆయన సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ 1943లో ఆలపించిన గీతాన్ని జాతీయగీతంగా ప్రకటించాలంటూ మోదీకి లేఖ రాశారు. జనగణమన గీతంలోని భారత భాగ్య విధాత అనే పదానికి బదులుగా ‘షుభ్ సుఖ్ చైన్’ అనే పదాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రయోగించిందని, ఇప్పుడా మార్పు అవసరమని పేర్కొన్నారు. కొత్త జాతీయ గీతాన్ని వచ్చే ఏడాది జనవరి 26లోపు రూపొందించాలని సూచించారు.
జనగణమన గీతం చుట్టూ వివాదాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న సినిమా థియేటర్లలో జాతీయగీతం ఆలాపనను తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చేజరిగింది. జాతీయగీతాలపన జరిగే సమయంలో థియేటర్లలో అందరూ లేచి నిలబడాలనే నిబంధన పెట్టడం పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ఈ వ్యవహారం కొంత సద్దుమణిగినా… జాతీయ గీతం చుట్టూ ఉన్న సందేహాలు మాత్రం మళ్లీ మళ్లీ జనం మెదళ్లను తొలుస్తూనే ఉన్నాయి. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు.
ఇంగ్లాండు రాజుగా ఐదో జార్జ్‌కు పట్టాభిషేకం జరిగిన నేపథ్యంలో 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కన్వెన్షన్ లో ఠాగూర్ తొలిసారి జగనణమన గీతాన్ని ఆలపించారు. ఈ కన్వన్షన్ కు జార్జ్ కూడా పాల్గొన్నారు. ఈ గీతంలో అధినాయక అనే పదాలు బ్రిటీష్ రాజును ఉద్దేశించినవే అనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ‘జయహే భారత భాగ్య విధాత’ అనే పదాలు దేశ సౌభాగ్యానికి బ్రిటీష్ రాజే విధాత అనే అర్థాన్నిస్తున్నాయనే అభిప్రాయమూ ఉంది. అందుకే… ఈ గీతాన్ని మార్చాలని ఇప్పటికే రాజకీయ, సాహిత్య ప్రముఖులెందరో అభిప్రాయపడ్డారు.
జనగణమన గీతం ఆంగ్లేయుల పాలనను గుర్తుకు తెచ్చేదని, దాని స్థానంలో ‘వందేమాతరం’ లేదా ‘ఝండా ఊంఛే రహే హమారా’ గీతాల్లో ఏదో ఒక దానిని జాతీయ గీతంగా ప్రకటించాలని ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ గ్రహీత గోపాల్ దాస్ నీరజ్ గతంలో అభిపాయ్రపడ్డారు. ఇండియా బ్రిటీష్ కాలనీగా ఉన్నకాలంలో రాసిన గీతాన్ని ఇప్పటికీ ఆలపించడం సరైంది కాదన్నారు. ‘పంజాబ్ సింధు గుజరాత మరాఠా..’లోని సింధ్ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉందని ఆయన గుర్తుచేశారు. ఠాగూర్ బ్రిటీష్ రాజును కొనియాడుతూ జనగణమన గీతాన్ని రాశారని బరేలీ షెహర్ ఖాజీ మౌలానా అస్జద్ రజా ఖాన్ గతంలో అభిప్రాయపడ్డారు.
జాతీయ గీతం ‘జనగణమన’లోని అధినాయక్ పదాన్ని తొలగించాలని గతంలో రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ కూడా డిమాండ్ చేశారు. దాని స్థానంలో ‘మంగళ్’ పదాన్ని చేర్చాలన్నారు. ‘జనగణమన అధినాయక్ జయహో’ వాక్యం ఆంగ్లేయుల పాలనను పొగిడేలా ఉందని అభిప్రాయపడ్డారు. సింధు ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నందున జాతీయగీతంలో ఆ పదాన్ని తొలగించి దాని స్థానంలో ఈశాన్యం అనే పదాన్ని చేర్చాలంటూ 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టారు. తాజా ప్రధానికి ఎంపీ సుబ్రహ్మణ్యం రాసిన లేఖలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దేశానికి అదే బ్రిటీష్ రాజులను కొనియాడే గీతాన్ని జాతీయగీతంగా ఎంచుకోవడం ఎంతమాత్రమూ గౌరవనీయం కాదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచిస్తుందో లేదో చూడాలి మరి.