ఎన్నికలంటే ఎత్తులు పైఎత్తులు, ఆరోపణలు ప్రత్యారోపణలు, సామాజిక అంశాలు, హామీలతో పార్టీలు ప్రచారరంగాన్ని హోరెత్తించడం సాధారణం. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైన ఉత్తరప్రదేశ్ లో పార్టీలు అభ్యర్థుల జాబితాలు కూడా ప్రకటిస్తూ ప్రచార యుద్ధానికి సై అంటున్నాయి. ఈ దశలో కాంగ్రెస్ బరిలోకి దించిన ఒక అభ్యర్థి వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. సాధారణ ప్రచార అంశాలకు మించిన రాజకీయ అస్త్రంగా మారుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఉన్న బాలీవుడ్ నటి, మోడల్ అర్చన గౌతమ్ విషయంలో రచ్చ జరుగుతోంది. బికినీ గర్ల్ గా పేరుపొందిన ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేయడం కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల మంటలు రాజేసింది. దాంతో అర్చన గౌతమ్ పేరు రాష్ట్రంలో మార్మోగుతోంది.
ఎవరీ అర్చన గౌతమ్
యూపీకే చెందిన అర్చన గౌతమ్ మీరట్ ఐఐఎంటీ నుంచి బీజేఎంసీ చేశారు. 2014లో మిస్ యూపీగా ఎంపికైన ఆమె 2018లో మిస్ బికినీ టైటిల్ విన్నర్ గా నిలిచారు. అదే ఏడాది జరిగిన మిస్ కాస్మోస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ అవార్డ్, వుమన్ అచీవర్స్ అవార్డులు కూడా అందుకున్నారు. 2015లో బాలీవుడ్లో ప్రవేశించి గ్రేట్ గ్రాండ్ మస్తీ, హసీనా పార్కర్, భారత్ కంపెనీ సినిమాల్లో నటించారు. మోడల్ గానూ రాణిస్తున్నారు. గత ఏడాది కాంగ్రెసులో చేరిన అర్చన గౌతమ్ ను మీరట్‌లోని హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించింది. 40 శాతం సీట్లు మహిళలకే ఇస్తామని తన వాగ్దానంలో భాగంగా అర్చనకు అవకాశం కల్పించింది.
బీజేపీ-కాంగ్రెస్ మాటల యుద్ధం
అర్చన గౌతమ్ ఎంపికను తీవ్రంగా తప్పుపడుతూ బీజేపీ దాన్నో అస్త్రంగా సంధిస్తుంటే.. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ బీజేపీపై ప్రత్యారోపణలు చేస్తోంది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క, చవకబారు ప్రచారం కోసం కాంగ్రెస్ ఇటువంటి వారిని ఎంపిక చేసిందని బీజేపీ నాయకుడు రాకేష్ త్రిపాఠీ విమర్శించారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశం గానీ, ఎన్నికల పట్ల సీరియస్ నెస్ గానీ కాంగ్రెస్ కు లేవని ఆరోపించారు. సంత్ మహాసభ చీఫ్ చక్రపాణి స్వామి కూడా కాంగ్రెస్ పై మండిపడ్డారు. మానసికంగా దివాలా తీసిన పార్టీ నుంచి ఇంతకంటే ఏమీ ఆశించలేమని వ్యాఖ్యానించారు.
ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారికి మన సంస్కృతిపై కొంతైనా అవగాహన ఉండాలన్నారు. హిందూ, హిందూత్వకు తేడా ఉందని చెప్పే కాంగ్రెస్ ఇలాంటివారిని ఎలా అభ్యర్థులుగా నిలబెడతారని ప్రశ్నించారు. అయితే బీజేపీ ఆరోపణలు, విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఒక నటీమణిని పోటీలోకి దించితే రాజకీయాలకు ముప్పు ఏర్పడుతుందా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ ప్రశ్నించారు. బీజేపీలో కూడా అనేకమంది నటులు ఉన్నారు.. వారిలో కొందరు మంత్రులుగా కూడా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ ఆలోచనలు ఇంత ఘోరంగా, కుత్సితంగా ఉంటాయా అని ప్రశ్నించారు. మరోవైపు వివాదానికి కేంద్ర బిందువైన అర్చన గౌతమ్ బీజేపీ విమర్శలపై మండిపడ్డారు. నటన, మోడలింగ్ తన వృత్తి అని.. రాజకీయాలకు దానికి సంబంధం లేదన్నారు. కానీ బీజేపీ వృత్తి, రాజకీయాలను కలిపి మేలు పొందడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
Also Read : నితీష్ ,హద్దు దాటొద్దంటున్న బీజేపీ