కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు కీలక నేతగా వ్యవహరించిన మోతీలాల్ ఓరా కన్నుమూశారు. ఆయన రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించారు. చివరకు ఏడాది క్రితం మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం ఆయన పేరు పరిశీలించడం విశేషం. రాహుల్ గాంధీ అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన నేపథ్యంలో ఆ స్థానంలో మోతీలాల్ ఓరా పేరు ప్రతిపాదనకు వచ్చింది. సీనియర్ గా పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించి, పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు ప్రచారం సాగింది. చివరకు అలాంటి అవకాశం రాకుండానే ఆయన కన్నుమూశారు.
1927 డిసెంబర్ 20న జన్మించిన మోతీలాల్ ఓరా సరిగ్గా డిసెంబర్ 21న 93 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఉన్న దుర్గ్ ప్రాంతంలో ఆయన జన్మించారు. తొలుత జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆయన సోదరుడు కూడా జర్నలిస్టుగా రాణించారు. ఆ తర్వాత 1968లో తొలుత సమాజ్ వాదీ పార్టీ తరుపున దుర్గ్ మునిసిపాలిటీకి ప్రాతినిధ్యం వహించారు. ఆతర్వాత కాంగ్రెస్ లో చేరి ఇందిరా గాంధీకి చేరువయ్యారు. ఆ తర్వాత 1972లో తొలిసారిగా మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా అర్జున్ సింగ్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కొద్దికాలానికే 1985లో ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
ఇందిరా తర్వాత రాజీవ్, అనంతరం సోనియా గాంధీకి కూడా మోతీలాల్ ఓరా సన్నిహితంగా మెలిగారు. 1988 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో విమానయాన మంత్రిగా పనిచేశారు. 1993లోనే ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1998లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, పత్రికలకు సంబంధించిన బాధ్యతలను మోతీలాల్ ఓరా నిర్వహించారు. కీలకమైన సీడబ్ల్యూసీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
మధ్యప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగిన మోతీలాల్ మరణానికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోనియా, రాహుల్ సహా పలువురు నేతలు సంతాప సందేశాలు విడుదల చేశారు. కాంగ్రెస్ లో పాతతరం నేతల్లో కీలకంగా మారిన ఒక్కొక్కరుగా దూరం కావడం పార్టీకి నష్టమని అభిప్రాయపడ్డారు.