ఆలూ లేదు చూలు లేదు సామెత చెప్పినట్టు ఇంతకీ థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఎప్పుడు తెరుస్తారో ఇంకా ఖరారు కాలేదు కానీ ప్రొడక్షన్ హౌసుల్లో మాత్రం తేదీల హడావిడి మొదలయ్యింది. ఎవరూ ప్రకటించకపోయినా నిర్మాతలు మాత్రం నిత్యం డిస్ట్రిబ్యూటర్లతో టచ్ లో ఉంటూ ఎప్పుడు విడుదల చేయాలనే దాని మీద తర్జనభర్జనలు పడుతున్నారు. దీంట్లో కొన్ని లీకైపోయి ఏకంగా థియేటర్ల సెల్ఫ్ పబ్లిసిటీ దాకా వెళ్తున్నాయి. టక్ జగదీశ్ ఈ నెల 30నే వస్తుందన్న వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీని తాలూకు ఫోటోలతో పెద్ద హంగామా జరిగింది. కొన్ని ఊళ్ళలో సినిమా హాళ్ల దగ్గర ఏకంగా బోర్డులు కూడా పెట్టేశారు.
దీని సంగతలా ఉంచితే విశ్వక్ సేన్ పాగల్ కూడా వచ్చే నెల రెండో వారం లోపే వచ్చేలా ప్లాన్ చేసుకుంటోందని లేటెస్ట్ అప్ డేట్. అది టక్ జగదీశ్, లవ్ స్టోరీ డేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నాని సినిమా 30 కాకుండా ఆగష్టు 6 లేదా 13 వస్తే పాగల్ ని ఈ నెలాఖరుకు తేవచ్చు. అలా కాకుండా రివర్స్ అయితే అప్పుడు ప్లాన్ మారిపోతుంది. లవ్ స్టోరీ అసలీ గొడవ లేకుండా ఆగస్ట్ 27 వెళ్లే ఆలోచన కూడా ఉందట. ఇదంతా లేనిపోని కన్ఫ్యూజన్ కు దారి తీస్తోంది. ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. మరోవైపు ఎగ్జిబిటర్లు మెల్లగా నిర్మాతల మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఏదో ఒకటి క్లియర్ గా చెప్పమని డిమాండ్ చేస్తున్నారు
ఇవాళ తెలుగు సినిమా నిర్మాతల తరఫున ప్రతినిధులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని కలిసి ఫస్ట్ వేవ్ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరచడంతో పాటు ఇప్పుడు తాము కోరుతున్న మినహాయింపుల గురించి ఒక వినతి పత్రం ఇచ్చి వచ్చారు. దీని మీద ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయన్నది అనుమానమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పంచాయితీ గురించి కూడా అక్కడ మంత్రిని కలిసే ప్లానింగ్ కూడా జరుగుతుందట. అసలు ఇవన్నీ ఇప్పుడీ పది రోజుల్లోనే జరిగిపోవాలి. అంత తేలిగ్గా ఈ వ్యవహారం తేలుతుందా అంటే ఏమో చెప్పలేం