ఒకరేమో ఇటీవలి కాలం వరకు అధ్యక్షుడిగా పనిచేసిన వారు. మరో నేత ఆయన స్థానంలో అధ్యక్షుడై కొనసాగుతున్నారు. పార్టీలో రాష్ట్రస్థాయి పదవుల్లో ఉన్న ఈ ఇద్దురు నేతలు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే కావడం విశేషం. అదే ఇప్పుడు చర్చనీయాంశం కూడా. రాష్ట్ర నేతలైనా జిల్లాలో వారి ఆధిపత్య పోరాటం ఆగలేదు. ఇంతకూ వారిద్దరూ ఎవరంటే.. ఒకరు కింజరాపు అచ్చెన్నాయుడు, మరొకరు కిమిడి కళా వెంకటరావు. జిల్లా టీడీపీలో మొదటి నుంచీ ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరాటం ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కి చెందిన ఓ నేత విషయంలో తాజాగా విభేదాలు బయటపడ్డాయి. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన సదరు నేతను ఆ నియోజకవర్గ ఇంఛార్జి హోదాలో కళా వెంకటరావు బహిష్కరించగా.. తన వర్గీయుడైన అతన్ని అచ్చెన్నాయుడు కొమ్ముకాస్తూ కాపాడుకొస్తున్నారు.
కళా బహిష్కరణ.. అచ్చెన్న రక్షణ
రాజాం నియోజకవర్గం రేగిడి మండలానికి చెందిన కళా వెంకటరావు ఆ నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించడంతో ఎచ్చెర్లకు వలస వచ్చారు. 2014లో అక్కడి నుంచే గెలిచి మంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల సమయానికి ఎచ్చెర్లలో లోకల్ ఫీలింగ్ వచ్చింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, పొందూరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు తదితర నేతలు డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు కళాకే అవకాశం ఇచ్చారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారే తన ఓటమికి కారణమని భావించిన కళా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఒక్కొక్కరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో మూడు నెలల క్రితం కలిశెట్టి అప్పలనాయుడును పార్టీ నుంచి బహిష్కరించారు. ఎచ్చెర్ల విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉంది. ఆ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తన సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున ద్వారా బహిష్కరణ ప్రకటన చేయించారు. అయితే కింజరాపు వర్గానికి చెందిన అప్పలనాయుడు వారి దన్నుతో బహిష్కరణను ఖాతరు చేయలేదు. కళాతో పనిలేకుండా తానే పార్టీ బ్యానర్ తో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆగ్రహించిన కళా పార్టీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడి ద్వారా మరో ప్రకటన ఇప్పించారు. పార్టీతో కలిశెట్టికి ఎటువంటి సంబంధంలేదని.. అతను నిర్వహించే కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనరాదన్నది దాని సారాంశం.
చంద్రబాబు దీక్షలో ప్రత్యక్షం.. విరాళం
ఇంత జరిగినా కళా మాట చెల్లలేదు. అచ్చెన్నాయుడుతో కలిశెట్టి అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షలోనూ పాల్గొన్నారు. ఆ సందర్బంగా పార్టీకి రూ.50 వేల విరాళం కూడా ప్రకటించారు. దీంతో అచ్చెన్న ఆయన్ను కాపాడుకొస్తున్నారని కళా వర్గం నిర్ధారణకు వచ్చి అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. బహిష్కరించిన నేతను పార్టీ ప్రధాన కార్యాలయంలోకి.. అందులోనూ అధినేత వద్దకు అనుమతించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కలిశెట్టి మరింత రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, నియోజకవర్గ ఇంఛార్జి నిర్ణయానికి విలువ లేకపోతే.. పార్టీలో క్రమశిక్షణ ఎలా ఉంటుందని అంటున్నారు. విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.